IT Stock Crash : ఐటీ రంగంలో ఏఐ ప్రకంపనలు..ఒక్కరోజే రూ.1.3లక్షల కోట్లు స్వాహా.
IT Stock Crash : ఐటీ రంగం అంటే ఒకప్పుడు ఉద్యోగాలకు కేరాఫ్ అడ్రస్.. కానీ ఇప్పుడు అదే రంగంపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నీడలు కమ్ముకుంటున్నాయి. ఫిబ్రవరి 12న భారతీయ ఐటీ షేర్లు కుప్పకూలడం ఇన్వెస్టర్లనే కాదు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను కూడా వణికించింది. ఒక్క రోజులోనే ఏకంగా రూ.1.3లక్షల కోట్లు గాలిలో కలిసిపోయాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీలే ఈ దెబ్బకు విలవిలలాడుతున్నాయి. భారత ఐటీ కంపెనీల ఆదాయంలో సింహభాగం అమెరికా క్లయింట్ల నుంచే వస్తుంది. తాజాగా అమెరికాకు చెందిన ఎంథ్రోపిక్ అనే ఏఐ స్టార్టప్ ఒక కొత్త టూల్‌ను లాంచ్ చేసింది. ఈ టూల్ లీగల్ కాంట్రాక్ట్ రివ్యూలు, డేటా అనాలిసిస్ వంటి సంక్లిష్టమైన పనులను మనుషుల కంటే వేగంగా, ఎలాంటి తప్పులు లేకుండా చేసేస్తోంది. ఇప్పటివరకు మన ఐటీ కంపెనీలు బీపీఓ, కెపిఓ సేవల ద్వారా చేసే పనులను ఇప్పుడు ఈ ఏఐ టూల్స్ చాలా తక్కువ ధరకే చేస్తున్నాయి. దీనివల్ల విదేశీ కంపెనీలు భారత ఐటీ దిగ్గజాలకు ఇచ్చే ఆర్డర్లను రద్దు చేసే అవకాశం ఉందన్న భయంతో షేర్లు కుప్పకూలాయి.
ఒకప్పుడు టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో వేల సంఖ్యలో ఇంజనీర్లను తీసుకునేవి. కానీ ఇప్పుడు ఆ సీన్ కనిపిస్తోంది. గడిచిన కొన్ని త్రైమాసికాల్లో టీసీఎస్ తన ఉద్యోగుల సంఖ్యలో దాదాపు 30,000 మందిని తగ్గించుకుంది. కొత్తగా గ్రాడ్యుయేట్లను తీసుకోవడం కూడా బాగా తగ్గించింది. గతంలో 10 మంది ఇంజనీర్లు చేసే కోడింగ్, బగ్ ఫిక్సింగ్ పనులను ఇప్పుడు ఒక్క ఏఐ టూల్ లేదా ఒక ఏజెంటిక్ ఏఐ చేసేస్తోంది. దీనిని నిపుణులు SaaSpocalypse అని పిలుస్తున్నారు.
కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ నివేదిక ప్రకారం.. భారతీయ ఐటీ కంపెనీలు పాత పద్ధతుల్లో పనిచేయడం వల్ల కొత్త ఏఐ టెక్నాలజీని వెంటనే అలవర్చుకోవడం కష్టంగా మారింది. ఎంథ్రోపిక్ లాంచ్ చేసిన Claude Cowork వంటి ప్లగ్-ఇన్లు నేరుగా కంప్యూటర్ స్క్రీన్‌పై మనుషుల లాగే పనులు చేయగలవు. దీనివల్ల భారీ ఫీజులు వసూలు చేసే భారత ఐటీ కంపెనీల వ్యాపార మోడల్ దెబ్బతినబోతోంది. మనుషుల అవసరం లేని ఈ ఏజెంట్ సాఫ్ట్‌వేర్లు ఐటీ కంపెనీల మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
ఐటీ రంగంలో ఈ సంక్షోభం ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. కేవలం కోడింగ్ తెలిస్తే సరిపోదు.. ఏఐతో కలిసి పనిచేయగలిగే స్పెషలైజ్డ్ స్కిల్స్ ఉన్నవారికే భవిష్యత్తులో ఉద్యోగాలు లభిస్తాయి. ఐటీ దిగ్గజాలు కూడా తమ వ్యాపార శైలిని మార్చుకోకపోతే, ఈ ఏఐ ప్రవాహంలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఇన్వెస్టర్లు కూడా టెక్నాలజీ స్టాక్స్ విషయంలో ఆచితూచి అడుగువేయాల్సిన సమయం ఇది.