Gift Tax : గిఫ్ట్ ఇచ్చినా పన్ను కట్టాలా? ఆదాయపు పన్ను శాఖకు ఐటీఏటీ చురకలు.
Gift Tax : బంధుత్వంలో ఇచ్చిపుచ్చుకునే బహుమతులు సాధారణమే. కానీ ఓ వ్యక్తికి తన బావమరిది ఇచ్చిన విలువైన బహుమతి ఏకంగా ఆదాయపు పన్ను చిక్కుల్లోకి నెట్టింది. దుబాయ్‌లో నివసించే డాక్టర్ చౌదరి అనే ఎన్ఆర్ఐకి తన బావమరిది నుంచి రూ.80 లక్షల విలువైన గిఫ్ట్ అందింది. దీన్ని ఆదాయంగా పరిగణించిన ఆదాయపు పన్ను శాఖ, డాక్టర్ చౌదరికి ఏకంగా రూ.69 లక్షల భారీ పన్ను నోటీస్ జారీ చేసింది. ఈ వివాదం చివరకు ఐటీఏటీ కోల్‌కతా బెంచ్ వరకు వెళ్ళింది. నవంబర్ 4, 2025న వచ్చిన ఐటీఏటీ తీర్పుతో బహుమతులపై పన్ను నియమాలు బంధువు నిర్వచనం స్పష్టమయ్యాయి.
దుబాయ్ లో నివసిస్తున్న డాక్టర్ చౌదరి తన ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసినప్పుడు ఈ సమస్య మొదలైంది. ఆయన తన మొత్తం ఆదాయం రూ.20 లక్షలుగా చూపగా, తన బ్యాంకు ఖాతాలో జరిగిన రూ.80 లక్షల భారీ లావాదేవీని ఆదాయపు పన్ను శాఖ గుర్తించింది. ఈ లావాదేవీపై అనుమానం వచ్చిన ఐటీ శాఖ, మొదట సెక్షన్ 131 కింద, ఆ వెంటనే సెక్షన్ 133(6) కింద నోటీసులు జారీ చేసింది. డాక్టర్ చౌదరి ఈ రూ.80 లక్షలు తన బావమరిది నుంచి బహుమతిగా వచ్చాయని ఆధారాలతో సహా వివరించారు. అయినప్పటికీ, అధికారులు సంతృప్తి చెందలేదు.
డాక్టర్ చౌదరి సమర్పించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకోని ఐటీ అధికారి, ఆయన కేసును రీ-అసెస్‌మెంట్ కోసం ఎంచుకున్నారు. అన్ని వాదనలను కొట్టివేసిన అధికారి, సెక్షన్ 143(3), 147 కింద అసెస్‌మెంట్ ఆర్డర్ జారీ చేశారు. ఇందులో డాక్టర్ చౌదరి మొత్తం ఆదాయాన్ని రూ.1.5 కోట్లుగా నిర్ణయించి, దానిపై రూ.69 లక్షల భారీ పన్ను డిమాండ్‌ను విధించారు. ఈ నిర్ణయంతో డాక్టర్ చౌదరి ముందుగా కమిషనర్ ను ఆశ్రయించారు. CIT(A) కొంతవరకు ఉపశమనం ఇచ్చినా, రూ.80 లక్షల్లోని రూ.55 లక్షల బహుమతి అంశాన్ని మాత్రం కొట్టివేశారు.
చివరికి ఈ వివాదం కోల్‌కతా ఐటీఏటీ బెంచ్ వద్దకు చేరింది. అక్కడ నవంబర్ 4, 2025న ట్రిబ్యునల్ డాక్టర్ చౌదరికి పూర్తి విజయాన్ని అందించింది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 56(2)(vii) కింద బంధువు నిర్వచనంలో బావమరిది కూడా చేరతారని ఐటీఏటీ స్పష్టం చేసింది. బంధువుల నుంచి అందుకున్న ఏ బహుమతి అయినా, అది పూర్తిగా పన్ను మినహాయింపు పరిధిలోకి వస్తుందని తెలిపింది. బహుమతి మినహాయింపు పొందడానికి చట్టప్రకారం ఫార్మల్ గిఫ్ట్ డీడ్ అవసరం లేదని ట్రిబ్యునల్ పేర్కొంది. ముఖ్యంగా, బహుమతి మొత్తం బ్యాంకింగ్ ఛానెల్ ద్వారా వచ్చి, లావాదేవీ వాస్తవికత నిరూపితమైనప్పుడు, డీడ్ లేకపోవడం సమస్య కాదని తేల్చి చెప్పింది.
బహుమతి ఇచ్చిన వ్యక్తి (బావమరిది) ఫండ్స్ మూలంపై ఐటీ శాఖకు అనుమానం ఉంటే, దానిని ఆ బావమరిది పన్ను పరిశీలన పరిధిలో విచారించాలి తప్ప, బహుమతి అందుకున్న డాక్టర్ చౌదరిపై కాదని ఐటీఏటీ స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో రూ.80 లక్షల బహుమతిని ఆదాయంగా పరిగణించిన ఐటీ శాఖ నిర్ణయాన్ని ఐటీఏటీ రద్దు చేసింది.