Tariff Hike : షాక్ ఇవ్వనున్న జియో, ఎయిర్‌టెల్..వచ్చే ఏడాది 20% వరకు పెరగనున్న 4G, 5G ప్లాన్స్ ధరలు.
Tariff Hike : వచ్చే ఏడాది మొబైల్, ఇంటర్నెట్ వాడే యూజర్లకు పెద్ద షాక్ తగలనుంది. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ అంచనా ప్రకారం.. జియో, ఎయిర్‌టెల్ వంటి టెలికాం కంపెనీలు తమ 4G, 5G ప్లాన్స్ ధరలను 16% నుంచి 20% వరకు పెంచే అవకాశం ఉంది. ఏప్రిల్ నుంచి జూన్ 2026 మధ్య ఈ ధరల పెంపుదల ఉండొచ్చు. కంపెనీలు ఇప్పటికే చౌక ప్లాన్లను ఆపివేయడం, స్ట్రీమింగ్ సేవలను ప్రీమియం ప్లాన్లతో మాత్రమే ఇవ్వడం వంటి చర్యల ద్వారా, వినియోగదారులను పెరిగిన ధరలకు సిద్ధం చేస్తున్నట్లు ఈ రిపోర్ట్ తెలిపింది. ఇది గత ఎనిమిది సంవత్సరాలలో టెలికాం రంగంలో జరగబోతున్న నాలుగో పెద్ద ధరల పెరుగుదల కావడం గమనార్హం.
ఈ ధరల పెరుగుదల కారణంగా టెలికాం కంపెనీల ఆదాయంలో భారీ వృద్ధి నమోదవుతుంది. ముఖ్యంగా ఎయిర్‌టెల్ దేశంలో తన ఆదాయ వాటాను నిలకడగా పెంచుకుంటోంది. 2024 ప్రారంభంలో ఎయిర్‌టెల్ ఆదాయ వాటా 36 శాతం ఉండగా, 2028 నాటికి అది 40 శాతం దాటుతుందని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. దీనికి విరుద్ధంగా వోడాఫోన్ ఐడియా ఆదాయ వాటా 24 శాతం నుంచి 18 శాతానికి, కస్టమర్ల వాటా 29 శాతం నుంచి 22.5 శాతానికి తగ్గే అవకాశం ఉంది. ఎయిర్‌టెల్ సగటు ఆదాయం కూడా 2026 నాటికి ₹260 నుంచి 2028 నాటికి రూ.320కు పెరుగుతుందని అంచనా. భవిష్యత్తులో ఇది రూ.370-రూ.390 వరకు చేరే అవకాశం ఉందని రిపోర్ట్ తెలిపింది.
జియో, ఎయిర్‌టెల్ సంస్థలు 5G నెట్‌వర్క్‌లను దాదాపుగా పూర్తి చేశాయి. దీని వల్ల కంపెనీలు తమ నెట్‌వర్క్ నిర్మాణం కోసం చేసే పెట్టుబడి ఖర్చు రెవెన్యూలో 30% నుంచి 20% కంటే తక్కువకు తగ్గిపోయింది. అంటే కంపెనీలు ఇప్పుడు పెట్టుబడుల కంటే ఆదాయాన్ని పెంచుకునే దశలోకి వచ్చాయి. మోర్గాన్ స్టాన్లీ అంచనా ప్రకారం.. ఎయిర్‌టెల్ ఇండియా వ్యాపారం ఒక్కటే 2026-27 ఆర్థిక సంవత్సరంలో $8 బిలియన్ల ఫ్రీ క్యాష్ ఫ్లోను ఉత్పత్తి చేయగలదు. ఎయిర్‌టెల్ నాన్-మొబైల్ వ్యాపారాలైన 5G ఎయిర్ ఫైబర్ బేస్డ్ హోమ్ బ్రాడ్‌బ్యాండ్, డేటా సెంటర్ పెట్టుబడులు కూడా కంపెనీ ఆదాయాన్ని భారీగా పెంచుతున్నాయి. అయితే, వోడాఫోన్ ఐడియాకు ఫండింగ్, రెగ్యులేటరీ రిలీఫ్ లభిస్తే, అది జియో, ఎయిర్‌టెల్ గుత్తాధిపత్యాన్ని కొంతమేర తగ్గించగలదని రిపోర్ట్ పేర్కొంది.