JSW MG : ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో భూకంపం..రెండేళ్లలో 6 కొత్త కార్లను రెడీ చేస్తున్న ఎంజీ.

Update: 2026-02-16 12:00 GMT

JSW MG : భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో టాటా మోటార్స్ తర్వాత రెండో స్థానాన్ని దక్కించుకున్న జేఎస్ డబ్ల్యూ మోటార్ మోటార్ ఇండియా ఇప్పుడు మరింత దూకుడు పెంచింది. వచ్చే రెండేళ్లలో (2026-2027 మధ్య) భారత రోడ్లపైకి ఏకంగా 6 కొత్త కార్లను తీసుకురావాలని ఈ సంస్థ భారీ స్కెచ్ వేసింది. ఇందులో మెజారిటీ కార్లు ఎలక్ట్రిక్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడల్స్ కావడం విశేషం. కేవలం పెట్రోల్, డీజిల్ కార్లకే పరిమితం కాకుండా, తమను తాము ఒక న్యూ-ఎనర్జీ బ్రాండ్‌గా నిలబెట్టుకోవడమే లక్ష్యంగా కంపెనీ ముందుకు సాగుతోంది.

జేఎస్ డబ్ల్యూ గ్రూప్, చైనాకు చెందిన SAIC మధ్య ఏర్పడిన ఈ జాయింట్ వెంచర్, భవిష్యత్తులో తమ మొత్తం అమ్మకాల్లో 75 శాతం వాటాను ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల ద్వారానే సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్భంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అనురాగ్ మెహ్రోత్రా మాట్లాడుతూ.. మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల వృద్ధి నెమ్మదించడానికి కారణం డిమాండ్ లేకపోవడం కాదు, సరైన ఆప్షన్లు లేకపోవడమేనని అభిప్రాయపడ్డారు. ఎంత ఎక్కువ మంది ప్లేయర్స్ మార్కెట్లోకి వచ్చి కొత్త మోడల్స్ లాంచ్ చేస్తే, కస్టమర్లు అంత ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ప్రస్తుతం భారత ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా సుమారు 45 శాతం వరకు ఉంది. అయితే జీఎస్టీ తగ్గింపు తర్వాత ఐసీఈ (పెట్రోల్/డీజిల్) వాహనాల జోరు పెరగడంతో ఈవీల జోరు కొంచెం తగ్గింది. కానీ, 2026 నాటికి నమ్మకమైన మోడల్స్ మార్కెట్లోకి రావడం వల్ల ఎలక్ట్రిక్ వాహనాల వాటా 67 శాతానికి చేరుకుంటుందని కంపెనీ అంచనా వేస్తోంది. అందుకే, ఎంజీ మోటార్ తన రాబోయే ఉత్పత్తులలో కనీసం ఒక ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడల్‌ను ఖచ్చితంగా లాంచ్ చేయబోతోంది. వీరి వద్ద ఉన్న ఫ్లెక్సిబుల్ ఆర్కిటెక్చర్ వల్ల ఒకే రకమైన కారును ఎలక్ట్రిక్, హైబ్రిడ్, పెట్రోల్ వెర్షన్లలో కూడా తయారు చేసే వీలుంది.

గతంలో ఎంజీ విండ్‌సర్ ఈవీ భారత మార్కెట్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకు తెలిసిందే. కేవలం రూ.13 లక్షల నుంచి రూ.18 లక్షల మధ్య ఉన్న ప్రైస్ సెగ్మెంట్‌ను సరిగ్గా గుర్తించి, ఆ గ్యాప్‌ను విండ్‌సర్ ఈవీతో ఎంజీ భర్తీ చేసింది. ఇప్పుడు రాబోయే 6 కొత్త మోడల్స్ కూడా ఇదే స్ట్రాటజీని అనుసరించబోతున్నాయి. కంపెనీ కేవలం బడ్జెట్ కార్లకే పరిమితం కాకుండా, MG Select ఛానల్ ద్వారా ప్రీమియం, హై-మార్జిన్ మోడల్స్‌ను కూడా తీసుకురానుంది. సామాన్యుడికి అందుబాటులో ఉండే ఈవీల నుంచి లగ్జరీ కార్ల వరకు ఎంజీ తన పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది.

పెట్రోల్, డీజిల్ మోడల్స్‌ను కొనసాగిస్తూనే ఎంజీ మోటార్ తన 80 శాతం ఫోకస్‌ను కేవలం న్యూ ఎనర్జీ వెహికల్స్‌పైనే ఉంచబోతోంది. ఈ కొత్త లాంచ్‌ల సహాయంతో 2026, ఆ తర్వాత కూడా ఆటోమొబైల్ ఇండస్ట్రీ యావరేజ్ గ్రోత్ కంటే వేగంగా ఎంజీ ఎదుగుతుందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల నిర్మాణం, బ్యాటరీ టెక్నాలజీపై కూడా కంపెనీ భారీగా పెట్టుబడులు పెడుతోంది.

Tags:    

Similar News