JSW : డిఫెండర్ కే దడ పుట్టిస్తున్న జెటూర్ T2..JSW మోటార్స్ నుంచి రాబోతున్న నయా ఎస్‍యూవీ.
JSW :JSW గ్రూప్ తన సొంత బ్రాండ్‌తో ఆటోమొబైల్ రంగంలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తోంది. చైనాకు చెందిన చెరీ ఆటోమొబైల్ అనుబంధ సంస్థ అయిన జెటూర్ తో కలిసి JSW మోటార్స్ తన మొదటి ఎస్‍యూవీ జెటూర్ T2ను భారత్‌లో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్‌లో ఉన్న కొత్త ప్లాంట్‌లో ఈ కారును అసెంబుల్ చేయనున్నారు.
JSW మోటార్స్ మార్కెట్లోకి తెస్తున్న ఈ జెటూర్ T2 ఎస్‍యూవీ చూడటానికి అచ్చం ల్యాండ్ రోవర్ డిఫెండర్ లాంటి లగ్జరీ కారును పోలి ఉంటుంది. ఇది 5-సీటర్ అయినప్పటికీ, దీని పొడవు 4,785 మిమీ. అంటే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మహీంద్రా XUV 7XO, టాటా సఫారి వంటి దిగ్గజ కార్ల కంటే కూడా ఇది పెద్దది. 2,800 మిమీ భారీ వీల్‌బేస్, 220 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటం వల్ల ఇది ఎలాంటి మొరటు రోడ్ల మీదనైనా రాజసం ఉట్టిపడేలా దూసుకెళ్తుంది.
పర్యావరణంపై మక్కువతో JSW ఈ కారును 1.5 లీటర్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఇంజన్‌తో తీసుకువస్తోంది. గ్లోబల్ మార్కెట్‌లో ఇది రెండు వెర్షన్లలో అందుబాటులో ఉంది. ఒకటి 224 PS పవర్ ఇచ్చే మోడల్ అయితే, మరొకటి ఏకంగా 462 PS పవర్, 700 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే ట్రై-మోటార్ వెర్షన్. ఇది ప్యూర్ ఎలక్ట్రిక్ మోడ్, హైబ్రిడ్ మోడ్ ఇలా వేర్వేరు ఆప్షన్లతో పనిచేస్తుంది. అంటే సిటీలో ఎలక్ట్రిక్ కారులా, లాంగ్ జర్నీలో పవర్‌ఫుల్ పెట్రోల్ కారులా వాడుకోవచ్చు.
ఈ కారు ఇంటీరియర్ చూస్తే కళ్ళు తిరగాల్సిందే. డాష్‌బోర్డ్‌లో 15.6 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఉంటుంది. దీనితో పాటు సోనీ బ్రాండ్‌కు చెందిన 12 స్పీకర్ల సౌండ్ సిస్టమ్ ప్రయాణాన్ని మ్యూజికల్ ఫెస్టివల్‌లా మారుస్తుంది. పనోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీల కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, లెవెల్-2 ADAS వంటి హై-టెక్ సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 8155 స్మార్ట్ చిప్ టెక్నాలజీతో ఈ కారు ఎంతో వేగంగా స్పందిస్తుంది.
JSW జెటూర్ T2 భారత్‌లో 2026లో దీపావళి సమయానికి లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ కారు ధర సుమారు రూ.40 లక్షల నుంచి రూ.45 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా. ఇది కేవలం హైబ్రిడ్ మాత్రమే కాకుండా భవిష్యత్తులో పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వెర్షన్‌లో కూడా వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి కారు మార్కెట్లో ఈ జెటూర్ సునామీ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.