Kawasaki : లక్షల డిస్కౌంట్.. ఉచిత యాక్సెసరీలు..కవాసాకి షోరూమ్ల వద్ద క్యూ కడుతున్న బైకర్లు.
Kawasaki : భారతదేశంలో సూపర్ బైక్ మార్కెట్ క్రమంగా పుంజుకుంటున్న తరుణంలో, కవాసాకి ఇండియా తన సేల్స్ పెంచుకునేందుకు భారీ వ్యూహాన్ని రచించింది. తన అధికారిక సోషల్ మీడియా వేదికగా ఎంపిక చేసిన మోడళ్లపై భారీ నగదు తగ్గింపులు, ఉచిత యాక్సెసరీలను అనౌన్స్ చేసింది. ఈ ఆఫర్లు జనవరి 31, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. పవర్ ఫుల్ నింజా ZX-10R నుంచి ఎంట్రీ లెవల్ నింజా 300 వరకు దాదాపు అన్ని మోడళ్లపై కంపెనీ మేలు చేస్తోంది.
కవాసాకి లైనప్‌లో అత్యంత శక్తివంతమైన నింజా ZX-10R పై కంపెనీ గరిష్టంగా రూ.2.50 లక్షల తగ్గింపును ఇచ్చింది. గతంలో రూ.20.79 లక్షలుగా ఉన్న దీని ధర ఇప్పుడు రూ.18.29 లక్షలకు దిగివచ్చింది. అలాగే టూరింగ్ బైక్ నింజా 1000 SX పై రూ.1.43 లక్షల భారీ డిస్కౌంట్ ప్రకటించడంతో, దీని ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు రూ.12.99 లక్షలుగా ఉంది. రేసింగ్ బైక్ ZX-6R కొనేవారికి ధరలో మార్పు లేకపోయినా, రూ. 83,000 విలువైన ప్రీమియం ఓహ్లిన్స్ స్టీరింగ్ డాంపర్ను కంపెనీ ఉచితంగా అందిస్తోంది.
అడ్వెంచర్ బైక్ ఇష్టపడే వారికి వెర్సిస్ 1000 పై రూ.లక్ష వరకు నగదు తగ్గింపు లభిస్తోంది. చిన్న అడ్వెంచర్ బైక్ వెర్సిస్-X 300 పై రూ. 46,000 విలువైన యాక్సెసరీలను ఫ్రీగా పొందవచ్చు. మధ్యతరగతి బైక్ ప్రేమికులు ఎక్కువగా ఇష్టపడే నింజా 650 పై రూ.27,000, నింజా 500 పై రూ. 17,000, ఎంట్రీ లెవల్ నింజా 300 పై రూ.28,000 తగ్గింపు ప్రకటించారు. దీనివల్ల నింజా 300 ఇప్పుడు కేవలం రూ.2.89 లక్షలకే అందుబాటులోకి వచ్చింది.