Kawasaki : రూ. 2.50 లక్షల డిస్కౌంట్‌తో సూపర్ బైక్.. షోరూమ్‌లు ఖాళీ అవ్వకముందే కొనేయండి.
Kawasaki :బైక్ లవర్లకు కొత్త సంవత్సరం అదిరిపోయే వార్త. ప్రముఖ సూపర్ బైక్ కంపెనీ కవాసకి ఇండియా తన పాపులర్ మోడల్స్ పై భారీ ధరల తగ్గింపును ప్రకటించింది. ముఖ్యంగా యువతను ఆకట్టుకునే Z650, Z650RS బైక్‌లపై రూ. 27,000 వరకు డిస్కౌంట్ ఇస్తోంది. కేవలం ఈ రెండు మోడల్స్ మాత్రమే కాకుండా, కవాసకి రేంజ్‌లోని నింజా వంటి ఇతర ప్రీమియం బైక్‌లపై కూడా లక్షల రూపాయల మేర ధరలు దిగివచ్చాయి. ఈ ఆఫర్ జనవరి 31, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది.
కవాసకి ఇండియా తన నియో-రెట్రో స్టైల్ బైక్ అయిన Z650RS ధరను రూ. 20,000 తగ్గించింది. దీంతో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.63 లక్షలకు చేరుకుంది. ఇక స్టైలిష్ లుక్ కలిగిన Z650 మోడల్‌పై ఏకంగా రూ. 27,000 తగ్గింపు ప్రకటించడంతో, ఇప్పుడు ఇది రూ. 6.99 లక్షలకే అందుబాటులోకి వచ్చింది. ఈ రెండు బైక్‌లు కూడా లేటెస్ట్ E20 ఇంధన ప్రమాణాలకు అనుగుణంగా రూపొందాయి. ఈ ఆఫర్ కేవలం 2025లో తయారైన యూనిట్లపై మాత్రమే వర్తిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. కాబట్టి పాత ధరకే కొత్త ఫీచర్ల బైక్ పొందేందుకు ఇది గొప్ప అవకాశం.
కవాసకి Z650, Z650RS రెండింటిలోనూ 649cc లిక్విడ్-కూల్డ్, ట్విన్-సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 68 hp పవర్, 64 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ ఇంజిన్, లాంగ్ రైడ్స్ చేసేవారికి, సిటీలో స్పీడ్ గా వెళ్లాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్. ఈ కేటగిరీలో 180-డిగ్రీ ఫైరింగ్ ఆర్డర్‌ని ఉపయోగించే అతికొద్ది బైక్‌లలో ఇవి ఒకటి. అందుకే వీటి సౌండ్, వేగం ఇతర మిడిల్‌వెయిట్ బైక్‌ల కంటే చాలా భిన్నంగా, పవర్‌ఫుల్‌గా ఉంటుంది. మార్కెట్‌లో ప్రస్తుతం వీటికి సరైన పోటీదారులే లేరని చెప్పవచ్చు.
కవాసకి ప్రకటించిన ఆఫర్లలో అత్యంత భారీ డిస్కౌంట్ సూపర్ బైక్ నింజా ZX-10R పై ఉంది. ఈ బైక్ ధరను ఏకంగా రూ. 2.50 లక్షలు తగ్గించడంతో, ఇప్పుడు దీని ధర రూ. 18.29 లక్షలకు దిగివచ్చింది. అలాగే నింజా 1000 SX పై రూ. 1.43 లక్షల తగ్గింపు ఇచ్చారు. ఇక ZX-6R బైక్ ధరను నేరుగా తగ్గించనప్పటికీ, దానితో పాటు రూ. 83,000 విలువైన ఓహ్లిన్స్ స్టీరింగ్ డాంపర్ను ఉచితంగా అందిస్తున్నారు. ఈ ఆఫర్లు అన్నీ జనవరి చివరి వరకు మాత్రమే ఉంటాయి కాబట్టి, బైక్ ప్రియులు తమ దగ్గరలోని డీలర్‌ను సంప్రదించి బుక్ చేసుకోవడం మంచిది.