Kia EV2 : సింగిల్ ఛార్జ్‌తో 400 కి.మీ రేంజ్..ఈ కారు పక్కా మిడిల్ క్లాస్ వాళ్ల కోసమే.

Update: 2025-12-05 08:15 GMT

Kia EV2 : ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా తన కొత్త ఎలక్ట్రిక్ క్రాసోవర్ అయిన EV2ను పరిచయం చేయడానికి సిద్ధమవుతోంది. ఈ కారును 2026 జనవరి 9న జరగబోయే బ్రస్సెల్స్ మోటార్ షో లో అధికారికంగా ప్రదర్శించనున్నారు. కియా EV2, ఈ ఏడాది ప్రారంభంలో EV2 కాన్సెప్ట్‌గా పరిచయం చేసింది. మార్కెట్లో విడుదలైన తర్వాత ఇది దక్షిణ కొరియా ఆటో సంస్థ నుంచి రాబోయే కొత్త ఎంట్రీ-లెవల్ (అతి తక్కువ ధర) ఎలక్ట్రిక్ కారు కానుంది. దీని టీజర్‌ను కియా ఇప్పటికే విడుదల చేసింది. ఇది రాబోయే కారుపై అంచనాలను పెంచింది.

డిజైన్ , నిర్మాణం

కియా EV2 టీజర్ ఫోటోలను బట్టి చూస్తే, ఈ ఎలక్ట్రిక్ కారు కాంపాక్ట్ సైజులో నిటారుగా ఉండే డిజైన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇందులో చిన్న రేర్ ఓవర్‌హ్యాంగ్, స్పోర్టీ లుక్ కోసం రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్, స్లీక్ డిజైన్‌తో కూడిన వెర్టికల్ LED DRLs, LED హెడ్‌ల్యాంప్‌లు, LED టెయిల్‌లైట్లు ఉంటాయి. అంతేకాకుండా, మస్కులర్ స్కిడ్ ప్లేట్, చంకీ క్లాడింగ్ కూడా ఈ కారుకు రఫ్‌ లుక్‌ను ఇస్తాయి. సైడ్ ప్రొఫైల్‌లో బాక్సీ ఆకారం, పైకి వంగిన విండో లైన్ దీనికి స్టైలిష్ లుక్‌ను ఇస్తాయి.

పవర్‌ట్రైన్

కియా EV2 పవర్‌ట్రైన్, మెకానికల్ వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా ధృవీకరించనప్పటికీ ఇది కంపెనీ 400V E-GMP స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుందని అంచనా. ఇదే ఆర్కిటెక్చర్‌పై హ్యుందాయ్ ఇన్‌స్టర్ కూడా నిర్మించారు. హ్యుందాయ్ ఇన్‌స్టర్ 42 kWh, 49 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తుంది. కాబట్టి కియా EV2 కూడా అదే విధమైన బ్యాటరీ ప్యాక్‌లతో మార్కెట్లోకి రావొచ్చు. ఈ EV2 కారులో సింగిల్ ఫ్రంట్-మౌంటెడ్ మోటార్ ఉండే అవకాశం ఉంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే, ఇది సుమారుగా 350-400 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వగలదని భావిస్తున్నారు.

Tags:    

Similar News