Kia EV2 : కియా నుంచి చౌకైన ఎలక్ట్రిక్ కార్..సింగిల్ ఛార్జ్‌తో 448 కిలోమీటర్ల రేంజ్.

Update: 2026-01-12 12:45 GMT

Kia EV2 : కియా మోటార్స్ తన గ్లోబల్ ఎలక్ట్రిక్ లైనప్‌లో ఆరవ మోడల్‌గా Kia EV2ను పరిచయం చేసింది. ఇది బి-సెగ్మెంట్‎కు చెందిన సబ్‌కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. ఎలక్ట్రిక్ కార్లను సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో కియా ఈ కారును రూపొందించింది. ఇది కేవలం గ్లోబల్ మార్కెట్ కే కాకుండా, భారతీయ రోడ్లకు మరియు ఇక్కడి కస్టమర్ల బడ్జెట్‌కు సరిగ్గా సరిపోయేలా ఉంది. అధికారికంగా ఇంకా ప్రకటించనప్పటికీ, 2026 చివరి నాటికి ఈ కారు భారత్ లో అడుగుపెట్టే అవకాశం ఉంది.

Kia EV2 లో కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా రెండు రకాల బ్యాటరీ ప్యాక్‌లను అందిస్తున్నారు. స్టాండర్డ్ వెర్షన్ 42.2 kWh బ్యాటరీతో వస్తుంది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 317 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. లాంగ్ రేంజ్ వెర్షన్ 61 kWh బ్యాటరీతో వస్తుంది. ఇది ఏకంగా 448 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఈ కారులో 400V ఛార్జింగ్ సిస్టమ్ ఉంది. డీసీ ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో కేవలం 30 నిమిషాల్లోనే 10 నుండి 80 శాతం బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు.

నగరాల్లోని రద్దీలో ఈజీగా డ్రైవ్ చేసేలా కియా EV2 ను రూపొందించారు. దీని పొడవు 4,060 mm, వెడల్పు 1,800 mm. కియా సిగ్నేచర్ స్టైల్ అయిన స్టార్ మ్యాప్ ఎల్‌ఈడీ లైటింగ్, స్పోర్టీ లుక్ దీనికి హైలైట్. ఇందులో 16 నుంచి 19 అంగుళాల వరకు వేర్వేరు వీల్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా స్పోర్టీ లుక్ ఇష్టపడే వారి కోసం GT-Line వేరియంట్ కూడా రాబోతోంది.

భారత్‌లో ఇటీవలే విడుదలైన కియా సైరోస్ ఇంటీరియర్ కు దీనికి చాలా పోలికలు ఉన్నాయి. క్యాబిన్ లోపల మూడు పెద్ద డిజిటల్ స్క్రీన్లు ఉంటాయి. 12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 5.3 అంగుళాల క్లైమేట్ కంట్రోల్ డిస్ ప్లే, 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్. అంతేకాకుండా, ఓటీఏ అప్‌డేట్స్, ఫిజికల్ బటన్ల కలయికతో డ్రైవర్‌కు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

భారత మార్కెట్లో ప్రస్తుతం ఎంజీ విండ్సర్ ఈవీ తన రేంజ్, ఫీచర్లతో దూసుకుపోతోంది. అయితే కియా EV2 తన బ్రాండ్ వాల్యూ, ఎక్కువ రేంజ్ ఆప్షన్లు, ఆధునిక ఫీచర్లతో విండ్సర్‌కు గట్టి సవాల్ విసరబోతోంది. ముఖ్యంగా కియా ఈ కారును భారత్‌లో తయారు చేస్తే, దీని ధర రూ.10 లక్షల నుండి రూ.15 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా. ఇదే జరిగితే ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో కియా రారాజుగా మారడం ఖాయం.

Tags:    

Similar News