Kia Seltos 2026 : క్రెటాకు కొరడా తప్పదా.. 7 పెద్ద అప్‌గ్రేడ్స్‌తో రాబోతున్న కొత్త జనరేషన్ కియా సెల్టోస్
Kia Seltos 2026 : మిడ్-సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్‌లో మంచి పోటీని ఇస్తున్న కియా సెల్టోస్ ఇప్పుడు మరింత స్మార్ట్‌గా, మోడ్రన్‌గా మారబోతోంది. SP3i కోడ్‌నేమ్‌తో పిలవబడుతున్న రెండవ తరం కియా సెల్టోస్ డిసెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా తొలిసారిగా ఆవిష్కరించనున్నారు. అధికారిక లాంచ్ వివరాలు ఇంకా వెల్లడి కానప్పటికీ ఈ SUV 2026 మొదటి భాగంలో షోరూమ్‌లలోకి వచ్చే అవకాశం ఉంది. కొత్త సెల్టోస్.. హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, హోండా ఎలివేట్ వంటి వాటితో పాటు, త్వరలో రాబోయే టాటా సియెర్రా, రెనాల్ట్ డస్టర్ వంటి కొత్త మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
కొత్త సెల్టోస్‌లో 7 పెద్ద అప్‌గ్రేడ్లు
స్పై ఫోటోలు, లీక్ అయిన సమాచారం ప్రకారం.. పాత సెల్టోస్ మోడల్‌తో పోలిస్తే కొత్త 2026 సెల్టోస్‌లో 7 ముఖ్యమైన మార్పులు, అప్‌గ్రేడ్లు ఉండబోతున్నాయి.
1. పెద్ద సైజు, ఎక్కువ స్పేస్
కొత్త కియా సెల్టోస్ ప్రస్తుత మోడల్ కంటే పొడవుగా, వెడల్పుగా ఉంటుందని అంచనా. దీని పెరిగిన పరిమాణం కారణంగా క్యాబిన్‌లో ముఖ్యంగా లెగ్‌రూమ్, షోల్డర్ రూమ్‌లో ఎక్కువ స్థలం లభించే అవకాశం ఉంది. ప్రస్తుత సెల్టోస్ పొడవు 4,365mm, వెడల్పు 1,800mm, ఎత్తు 1,645mm గా ఉంది. వీల్‌బేస్ 2,610mm ఉంది. కొత్త మోడల్ వీటిని అధిగమించనుంది.
2. టెల్లూరైడ్ తరహా డిజైన్
కొత్త 2026 కియా సెల్టోస్ బ్రాండ్ కొత్త డిజైన్ లాంగ్వేజ్ ఫాలో అవుతుందని స్పై ఫోటోలు సూచిస్తున్నాయి. కొత్త కియా టెల్లూరైడ్ SUVలో చూసినట్లుగా సెల్టోస్ కూడా ఇప్పుడు మరింత నిటారుగా, బాక్సీ రూపాన్ని సంతరించుకుంటుంది. కొత్త అల్లాయ్ వీల్స్, కొత్త బంపర్‌లతో పాటు, ముందు భాగం కూడా పూర్తిగా కొత్తగా ఉండే అవకాశం ఉంది.
3. డ్యుయల్ కర్వ్డ్ స్క్రీన్
కారు ఇంటీరియర్‌ను పూర్తిగా కొత్తగా డిజైన్ చేస్తున్నారు. కొత్త డాష్‌బోర్డ్ డిజైన్ ఉంటుంది. ఇందులో కర్వ్డ్ డ్యుయల్ స్క్రీన్ సెటప్ (ఇన్ఫోటైన్‌మెంట్, డ్రైవర్ డిస్‌ప్లే), అప్‌డేట్ చేయబడిన కంట్రోల్ ప్యానెల్ ఉండే అవకాశం ఉంది. కొత్త అపోల్స్టరీ (సీట్ కవర్లు) కూడా రానున్నాయి.
4. అప్‌గ్రేడ్ అయిన ఫీచర్లు
కొత్త సెల్టోస్ పాత మోడల్‌లో ఉన్న ఫీచర్లతో పాటు, ప్యాకేజీ విలువను పెంచడానికి మరిన్ని అదనపు ఫీచర్లతో వస్తుంది. ముందు వైపు వెంటిలేటెడ్ సీట్లు, 8-వే పవర్ డ్రైవర్ సీటు, డ్యుయల్ పాన్ పనోరమిక్ సన్‌రూఫ్, ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) సూట్, అనేక ఎయిర్‌బ్యాగ్‌లు యధావిధిగా కొనసాగుతాయి.
5. ఇంజిన్‌లో మార్పు లేదు
పవర్‌ట్రైన్ పరంగా ఇంజిన్లలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న 115bhp, 1.5L నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 160bhp, 1.5L టర్బో పెట్రోల్, 116bhp, 1.5L డీజిల్ ఇంజిన్లు కొత్త సెల్టోస్‌లో కూడా కొనసాగుతాయి.
6. కొత్త 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్
ఒక పుకారు ప్రకారం డీజిల్ ఇంజిన్‌కు ప్రస్తుతం ఉన్న 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ స్థానంలో కొత్త 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అందించే అవకాశం ఉంది.
7. హైబ్రిడ్ వేరియంట్ రాక ఆలస్యం
కొత్త తరం కియా సెల్టోస్, హైబ్రిడ్ వేరియంట్ 2027లో మార్కెట్‌లోకి వస్తుందని భావిస్తున్నారు. కియా 1.5L NA పెట్రోల్ ఇంజిన్‌ను హైబ్రిడ్‌గా మార్చే అవకాశం ఉంది.
ధర పెరుగుదల
ఈ డిజైన్, ఫీచర్ల మార్పుల కారణంగా 2026 కియా సెల్టోస్ ధర ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం సెల్టోస్ ధర రూ. 10.79 లక్షల నుంచి రూ. 19.81 లక్షల (అన్నీ ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.