LAYOFFS: లేఆఫ్ లెవెల్ డేంజర్.. ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకం!

టెక్నాలజీ రంగానికి ఈ ఏడాది ప్రారంభం నుంచే గడ్డుకాలం;

Update: 2025-07-04 06:30 GMT

టెక్నాలజీ రంగానికి ఈ ఏడాది ప్రారంభం నుంచే గడ్డుకాలం ఎదురవుతోంది. దిగ్గజ కంపెనీలు వరుసగా ఉద్యోగులను తొలగించడం ఆందోళన కలిగిస్తోంది. గతేడాది ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో సంస్థలు భారీ లేఆఫ్స్‌ ప్రకటించగా, ఈ ఏడాది కృత్రిమ మేధ (AI) అందుబాటులోకి రావడంతో ఉద్యోగులపై మరింత ప్రభావం పడింది. 2024 తొలి ఆరు నెలల్లోనే లక్ష మందికి పైగా ఉద్యోగులు పని కోల్పోవడం గమనార్హం. ఈ తొలగింపులు గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, మేటా, ఇంటెల్‌, అమెజాన్‌, ఐబీఎం, హెచ్‌పీ వంటి పెద్ద కంపెనీల నుంచే రావడం చర్చనీయాంశంగా మారింది.

ఇంటెల్‌ నుంచి 20 శాతం మందికి లేఆఫ్స్‌

ఎలక్ట్రానిక్‌ చిప్‌ల తయారీలో దిట్టగా నిలిచిన ఇంటెల్‌ కూడా భారీగా ఉద్యోగులను తొలగిస్తోంది. జర్మనీలో ఆటోమోటివ్‌ చిప్‌ యూనిట్‌ మూసివేసిన సంస్థ, ప్రధాన కార్యాలయంలో 100 మందిని తొలగించింది. జూలైలో ప్రపంచవ్యాప్తంగా 20 శాతం సిబ్బందిని తొలగించే ప్రణాళికలో ఉంది. సీనియర్ ఇంజినీర్లు, క్లౌడ్ ఆర్కిటెక్టులు ఈ జాబితాలో ఉన్నారు.

అమెజాన్‌లో నాలుగు విడతల కోతలు

అమెజాన్‌ కమ్యూనికేషన్‌, వండరీ పాడ్‌కాస్ట్‌, సర్వీసెస్‌ విభాగాల్లో ఇప్పటికే నాలుగుసార్లు లేఆఫ్స్‌ ప్రకటించింది. వచ్చే రోజుల్లో మేనేజర్‌ విభాగాల్లో 14 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించనుందన్న వార్తలు ఫైనాన్షియల్‌ ఎక్స్‌ప్రెస్‌ ద్వారా బయటపడ్డాయి.

ఏఐ దెబ్బకు ఐబీఎం స్టెప్‌ బ్యాక్‌

ఐబీఎం కూడా ఈ ఏడాదిలో 8,000 మందిని తొలగించింది. వీరిలో చాలామంది హెచ్‌ఆర్‌ విభాగానికి చెందినవారే. 200 మందిని ఏఐ టూల్స్‌తో భర్తీ చేసినట్లు సమాచారం. ఈ పరిణామం టెక్నాలజీ మార్పు వల్ల ఉద్యోగాలపై పడుతున్న ప్రభావాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.

మైక్రోసాఫ్ట్‌లో వరుస కోతలు

టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఈ ఏడాది ఇప్పటివరకు నాలుగుసార్లు లేఆఫ్స్‌ ప్రకటించింది. మొత్తం ఉద్యోగుల్లో 4 శాతం మేరకు అంటే సుమారు 9,100 మందిని తొలగించింది. జూన్‌లో ఎక్స్‌బాక్స్‌, గేమింగ్‌ విభాగాల్లో కోతలు విధించగా, మేలో ఏకంగా 6 వేల మందిని ఇంటికి పంపింది. ఈ ఏడాది ప్రారంభంలో 1 శాతం మందిని తొలగించగా, గతేడాది 10 వేల మందిని తొలగించింది.

ఇతర దిగ్గజాల్లోనూ భారీ తొలగింపులు

ఇన్ఫోసిస్:ఈ ఏడాది రెండు విడతల్లో 540 మంది ఉద్యోగులను తొలగించింది.

గూగుల్: ఆండ్రాయిడ్‌, క్రోమ్‌, పిక్సెల్‌, హెచ్‌ఆర్‌ విభాగాల్లో వరుస కోతలు.

మెటా: 2024లో ఇప్పటివరకు 3,600 మందికి లేఆఫ్స్‌.

హెచ్‌పీ: పునర్వ్యవస్థీకరణలో 2,000 మందిని తొలగించింది.

టిక్‌టాక్: డబ్లిన్‌ ఆఫీసులో 300 మందికి లేఆఫ్స్‌.

ఓలా ఎలక్ట్రిక్: ఐదు నెలల్లో 1,000 మందిని తొలగించింది. సేల్స్‌ఫోర్స్‌, బ్లూ ఆర్జిన్: తలా 1,000 మందికి కోతలు.

సైమన్స్‌ గ్రూప్: ఆటోమేషన్‌, ఈవీ విభాగాల్లో 5,600 మందిని తీసేసింది. మ్యాచ్‌గ్రూప్‌, కాన్వా, క్రౌడ్‌స్ట్రైక్, ఇతర సంస్థల్లోనూ తొలగింపులు కొనసాగుతున్నాయి.

ఈ పరిణామాలన్నీ చూస్తే టెక్ రంగంలో ఉద్యోగ భద్రతపై ముసురు కమ్ముకుంటోంది. కంపెనీలు ఏఐ ఆధారిత పరికరాలు, ఆటోమేషన్‌ టూల్స్‌ వైపు మొగ్గుచూపడమే కాకుండా ఖర్చులను తగ్గించేందుకు హ్యూమన్‌ రీసోర్సును తగ్గిస్తున్నాయి.

Tags:    

Similar News