Tesla : కేవలం రూ.33 లక్షల రేంజ్.. 80 కి.మీ. రేంజ్.. టెస్లా నుంచి చౌకైన మోడల్ 3 వచ్చేసింది.
Tesla : ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా, తన మోడల్ 3 కొత్త, తక్కువ ధర కలిగిన వేరియంట్‌ను యూరప్‌లో విడుదల చేసింది. ఈ వేరియంట్ అమెరికాలో విడుదలైన సుమారు రెండు నెలల తర్వాత యూరోపియన్ మార్కెట్‌లోకి వచ్చింది. టెస్లా ముఖ్యంగా తగ్గుతున్న డిమాండ్‌ను, పెరుగుతున్న పోటీని ఎదుర్కోవడానికి ఈ నిర్ణయం తీసుకుంది. యూరప్‌లో టెస్లా డిమాండ్ నెమ్మదిస్తోంది. కొత్త మోడల్ Y లైనప్ ఉన్నప్పటికీ, ఈ సంవత్సరం కంపెనీ కొత్త రిజిస్ట్రేషన్లలో భారీ తగ్గుదల కనిపించింది. చాలా మంది కస్టమర్‌లు ఇప్పుడు వోక్స్‌వ్యాగన్ ID.3, చైనాకు చెందిన BYD ఆటో 3 వంటి పోటీదారుల వైపు మొగ్గు చూపుతున్నారు.
టెస్లా తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ఈ కొత్త మోడల్ 3ని తక్కువ ఖర్చుతో నడిచే కారుగా అభివర్ణించింది. ఈ వేరియంట్‌లో కొన్ని ప్రీమియం ఫీచర్లు, ఫినిషింగ్‌లను తొలగించారు. అయినప్పటికీ ఇది 300 మైళ్లు (480 కి.మీ.) కంటే ఎక్కువ డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుంది. దీని డెలివరీలు 2026 మొదటి త్రైమాసికం నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ధరల విషయానికి వస్తే జర్మనీలో కొత్త మోడల్ 3 స్టాండర్డ్ ధర 37,970 యూరోలుగా నిర్ణయించారు. నార్వేలో 330,056 క్రోన్, స్వీడన్‌లో 449,990 క్రోన్‌లుగా ఉంది. పోలిక కోసం, జర్మన్ వెబ్‌సైట్‌లో రెండవ అత్యంత చౌకైన మోడల్ 3 ప్రీమియం వేరియంట్ ధర 45,970 యూరోలుగా ఉంది.
భారత మార్కెట్‌లో ఎప్పుడు వస్తుంది?
టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ చాలా కాలంగా సాధారణ మార్కెట్ కోసం సరసమైన ఎలక్ట్రిక్ కార్లను తీసుకువస్తామని వాగ్దానం చేస్తూ వస్తున్నారు. అయితే, గత సంవత్సరం ఆయన కొత్త $25,000 కారు తయారీ ప్రణాళికను రద్దు చేశారు. ప్రస్తుతం టెస్లా ఇప్పటికే ఉన్న మోడళ్లకు చౌకైన వెర్షన్‌లను పరిచయం చేస్తోంది. ఈ వ్యూహం ద్వారా మస్క్ కంపెనీని AI, రోబోటాక్సీ, హ్యూమనాయిడ్ రోబోట్ల దిశగా నడిపిస్తున్నప్పటికీ, ఈ కొత్త, తక్కువ ధర కలిగిన కార్ మోడల్స్ కంపెనీ రాబోయే ఆదాయాలను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. యూరోప్, అమెరికాలలో చౌక వేరియంట్లను విడుదల చేసిన నేపథ్యంలో టెస్లా భవిష్యత్తులో భారతదేశంలో కూడా తమ అత్యధికంగా అమ్ముడయ్యే ఎలక్ట్రిక్ కార్లకు చౌక వేరియంట్లను విడుదల చేయవచ్చని ఆశించవచ్చు.
యూరప్‌లో యూరోపియన్, చైనీస్ కంపెనీలు $30,000 కంటే తక్కువ ధరలో ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో తన మార్కెట్ వాటాను కాపాడుకోవడానికి టెస్లా ప్రయత్నిస్తోంది. దీనికి ముందు టెస్లా గత అక్టోబర్‌లో తక్కువ ధర కలిగిన మోడల్ Yని కూడా విడుదల చేసింది. అమెరికాలో మోడల్ 3 స్టాండర్డ్ వేరియంట్ అక్టోబర్‌లో $36,990 ధరతో లాంచ్ అయింది. ఈ చౌక మోడల్స్, టెస్లా అధిక లాభదాయకత గల కార్ల అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయేమోనని విశ్లేషకులు కొంత ఆందోళన చెందుతున్నారు.