LIC : 43 నెలల తర్వాత మళ్లీ మార్కెట్‌లోకి ఎల్ఐసీ.. 13,200 కోట్ల భారీ ప్లాన్‌తో కేంద్రం
LIC : కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం చివరి నాటికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 1-1.5 బిలియన్ డాలర్లు (రూ. 8,800-13,200 కోట్లు) విలువైన వాటాను విక్రయించాలని ఆలోచిస్తోంది. వచ్చే కొన్ని వారాల్లో రోడ్ షోలు నిర్వహించే అవకాశం ఉంది. సెబీ ఆదేశాల మేరకు పబ్లిక్ షేర్ హోల్డింగ్‌ను 10 శాతం వరకు పెంచాలనే ప్రభుత్వ ప్రయత్నంలో ఇది భాగమని అధికారులు తెలిపారు. ప్రభుత్వం మే 2022లో ఐపీఓ ద్వారా ఎల్ఐసీలో 3.5 శాతం వాటాను విక్రయించి రూ. 20,557 కోట్లు సమీకరించింది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద షేర్ విక్రయాలలో ఒకటి.
కనీస పబ్లిక్ షేర్ హోల్డింగ్ పరిమితిని చేరుకోవడానికి, ఎల్ఐసీ మే 16, 2027 నాటికి మరో 6.5 శాతం వాటాను విక్రయించాలి. దీని ప్రస్తుత విలువ 4.2 బిలియన్ డాలర్లు లేదా రూ. 37,000 కోట్లకు కొంచెం ఎక్కువ. ప్రభుత్వం ప్రస్తుతం ఎల్ఐసీలో 96.5 శాతం వాటాను కలిగి ఉంది. కంపెనీ నిర్ణీత గడువులోగా 6.5 శాతం వాటాను విడతల వారీగా విక్రయించాలని ఆలోచిస్తోంది, అయితే దీనిని నెమ్మదిగా విక్రయిస్తారు అని వర్గాలు తెలిపాయి.
షేర్ ధర తగ్గకుండా, ఇప్పటికే ఉన్న వాటాదారులపై ప్రభావం పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఒక మర్చంట్ బ్యాంకర్ మాట్లాడుతూ.. వాటా విక్రయం అనేక దశల్లో జరుగుతుందని, మొదటి దశ ప్రస్తుత త్రైమాసికం చివరి నాటికి పూర్తవుతుందని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు. జులై 3 నుండి ఎల్ఐసీ షేర్ ధర ఐపీఓ ధర అయిన రూ. 949 కంటే తక్కువగా ఉంది. మంగళవారం ఇది స్వల్ప లాభాలతో రూ. 900.7 వద్ద ముగిసింది. ఆ తర్వాత కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 5.7 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ ప్రక్రియను నిర్వహించే పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (DIPAM) తదుపరి వాటా విక్రయానికి టైం ఖరారు చేయడానికి చర్చలను వేగవంతం చేసింది.
ఈ లావాదేవీని క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ లేదా ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే దానిపై కూడా నిర్ణయం తీసుకునే ప్రక్రియలో ఉంది. రాబోయే వారాల్లో జరిగే రోడ్ షోలలో ఇన్వెస్టర్ల డిమాండ్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంటారని ఒక వర్గం తెలిపింది. ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయని, అయితే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు. ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడం తొందరపాటు అవుతుందని ఆయన అన్నారు.