LPG Price Hike : కొత్త ఏడాది ఫస్ట్ రోజే షాకిచ్చిన ప్రభుత్వం..28నెలల తర్వాత భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.

Update: 2026-01-01 06:15 GMT

LPG Price Hike : కొత్త ఏడాది 2026 ప్రారంభమే సామాన్యుడికి గట్టి షాక్ ఇచ్చింది. ఒకవైపు పండుగ సంబరాల్లో మునిగిపోయిన ప్రజలకు ధరల పెరుగుదల రూపంలో ప్రభుత్వం చేదు వార్త అందించింది. ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఈ ఏడాది ఆరంభం అంత కలిసి రాలేదు. గత 28 నెలల్లో ఎన్నడూ లేనంతగా సిలిండర్ ధరలు పెరగడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులపై ఈ భారం పడటంతో బయటి తిండి కూడా మరింత ప్రియం కానుంది.

ఐఓసీఎల్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. దేశంలోని మూడు ప్రధాన మెట్రో నగరాల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై ఏకంగా 111 రూపాయలు పెరిగింది. ఒక్క చెన్నైలో మాత్రం 110 రూపాయల మేర పెంచారు. అక్టోబర్ 2023 తర్వాత ఈ స్థాయిలో ధరలు పెరగడం ఇదే మొదటిసారి. 2023 నవంబర్ తర్వాత మళ్లీ ఇప్పుడే రూ. 100 కంటే ఎక్కువ మొత్తంలో ఒకేసారి వాత పెట్టారు. ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర సుమారు రూ. 1700లకు చేరుకుంది. ఇది జూన్ 2025 తర్వాత గరిష్ట స్థాయి.

కమర్షియల్ సిలిండర్ ధరల పెంపు తర్వాత మెట్రో నగరాలైన ఢిల్లీలో రూ. 1,691.50 (రూ. 111 పెరిగింది), కోల్‌కతాలో రూ. 1,795 (రూ. 111 పెరిగింది), ముంబైలో రూ. 1,642.50 (రూ. 111 పెరిగింది), చెన్నైలో రూ. 1,849.50 (రూ. 110 పెరిగింది)గా ఉంది. చెన్నైలో సిలిండర్ ధర దాదాపు రూ. 1850కి చేరువవ్వడం గమనార్హం.హైదరాబాద్‌లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఒక్కసారిగా రూ.111 పెరిగింది. నిన్నటి వరకు రూ.1,801.50 గా ఉన్న ధర, ఈ పెంపుతో నేడు రూ.1,912.50 కి చేరుకుంది.

హోటల్ వ్యాపారులకు ఈ వార్త షాక్ ఇచ్చినప్పటికీ, సామాన్య గృహిణులకు మాత్రం ఊరట లభించింది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ (14.2 కేజీలు) ధరల్లో ప్రభుత్వం ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం ఢిల్లీలో గృహ వినియోగ సిలిండర్ ధర రూ.853, కోల్‌కతాలో రూ. 879, ముంబైలో రూ. 852.50, చెన్నైలో రూ. 868.50 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.హైదరాబాద్‌లో గృహ వినియోగ సిలిండర్ ధర యథాతథంగా రూ. 905.00 వద్దే కొనసాగుతోంది. చివరిసారిగా ఏప్రిల్ 2025లో గృహ సిలిండర్ ధరను 50 రూపాయలు పెంచారు. ఆ తర్వాత మార్చి 2024లో ఎన్నికలకు ముందు రూ. 100 తగ్గించిన సంగతి తెలిసిందే.

ఒకవైపు సిలిండర్ ధరలు పెరిగినా, మరోవైపు పైప్డ్ నేచురల్ గ్యాస్ వాడుతున్న వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కుకింగ్ గ్యాస్ పైప్ లైన్ ధరలను స్వల్పంగా తగ్గించింది. దీనివల్ల నగరాల్లో పైప్డ్ గ్యాస్ వాడే మధ్యతరగతి కుటుంబాలకు కొంత వెసులుబాటు లభించనుంది. అయితే కమర్షియల్ సిలిండర్ ధరల పెంపు ప్రభావం పరోక్షంగా సామాన్యుడిపై పడుతుంది. హోటల్ ఖర్చులు, క్యాంటీన్ ధరలు పెరిగే అవకాశం ఉండటంతో జేబుకు చిల్లు పడక తప్పదు.

Tags:    

Similar News