Mahindra : టాటా, హ్యుందాయ్‌లు గల్లంతు..రెండో స్థానానికి చేరిన దేశీయ దిగ్గజం.

Update: 2026-01-14 08:30 GMT

Mahindra : భారతీయ రోడ్లపై మహీంద్రా వాహనాల హవా కొనసాగుతోంది. 2025 డిసెంబర్ నెలలో మహీంద్రా మొత్తం 50,946 కార్లను విక్రయించింది. 2024 డిసెంబర్‌లో జరిగిన 41,424 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే ఇది ఏకంగా 23 శాతం వృద్ధి. ఈ అద్భుతమైన ప్రదర్శనతో మారుతి సుజుకి తర్వాత భారతదేశంలో అత్యధిక కార్లు అమ్ముతున్న రెండో అతిపెద్ద కంపెనీగా మహీంద్రా అవతరించింది. చాలా కాలంగా రెండో స్థానం కోసం పోటీ పడుతున్న టాటా, హ్యుందాయ్‌లను మహీంద్రా తన పవర్‌ఫుల్ ఎస్‌యూవీల దెబ్బతో వెనక్కి నెట్టేసింది.

మహీంద్రా విజయకేతనంలో స్కార్పియో కీలక పాత్ర పోషించింది. గత నెలలో ఏకంగా 15,885 స్కార్పియోలు అమ్ముడయ్యాయి. ఇది గతేడాది కంటే 30 శాతం ఎక్కువ. ఇక పల్లెటూళ్లలో తిరుగులేని ఆదరణ ఉన్న బొలెరో అమ్మకాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఏకంగా 79 శాతం వృద్ధితో 10,611 యూనిట్లు విక్రయించి గ్రామాల్లో తన సత్తా చాటింది. వీటితో పాటు XUV 3XO (9,422 యూనిట్లు), థార్ (Thar,Thar ROXX - 9,339 యూనిట్లు) కూడా మహీంద్రా జైత్రయాత్రలో తోడయ్యాయి.

కేవలం డీజిల్, పెట్రోల్ కార్లే కాకుండా మహీంద్రా తన కొత్త ఎలక్ట్రిక్ వాహనాలతోనూ దూసుకుపోతోంది. కొత్తగా వచ్చిన XEV 9e మోడల్ 2,154 యూనిట్లు, BE 6 మోడల్ 1,481 యూనిట్లు అమ్ముడయ్యాయి. అయితే XUV700 అమ్మకాలు ఈ నెలలో 1,424 కు పడిపోయాయి. దీనికి ప్రధాన కారణం కంపెనీ కొత్త మోడల్ XUV 7XOని తీసుకురావడమే. ఈ వారంలోనే దాని డెలివరీలు మొదలవుతుండటంతో వచ్చే నెలలో ఈ నంబర్లు మళ్ళీ పెరిగే అవకాశం ఉంది.

డిసెంబర్ ముగింపులో మహీంద్రా మంచి వృద్ధిని కనబరిచినప్పటికీ, నవంబర్ 2025 అమ్మకాలతో పోలిస్తే 9.5 శాతం తగ్గుదల కనిపించింది. నవంబర్‌లో 56,336 కార్లు అమ్ముడయ్యాయి. ఏదేమైనా 2025 సంవత్సరం మహీంద్రాకు ఒక తీపి జ్ఞాపకంలా మిగిలిపోయింది. పాత నమ్మకమైన బ్రాండ్లు (స్కార్పియో, బొలెరో), కొత్త ఎలక్ట్రిక్ కార్ల కలయికతో 2026లో మహీంద్రా మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News