Mahindra : 15 వేల కోట్ల పెట్టుబడి..లక్షల మందికి ఉపాధి..మహీంద్రా విజన్ S, X, T వచ్చేస్తున్నాయి.

Update: 2026-02-13 08:22 GMT

Mahindra : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా భవిష్యత్తు ప్రణాళికలను చూస్తుంటే గూస్ బంప్స్ రావడం ఖాయం. గతేడాది ఆగస్టు 15న ప్రపంచానికి పరిచయం చేసిన తన డ్రీమ్ ప్రాజెక్ట్స్ విజన్ S, విజన్ X, విజన్ T మోడళ్లపై కంపెనీ కీలక అప్‌డేట్ ఇచ్చింది. సరికొత్త టెక్నాలజీతో రూపొందుతున్న ఈ కార్ల ఉత్పత్తి ఎప్పుడు మొదలవుతుందో అధికారికంగా ప్రకటించింది. కేవలం వాహనాలే కాదు, వీటి కోసం మహీంద్రా నిర్మిస్తున్న మెగా ప్లాంట్ ఇప్పుడు భారత ఆటో రంగాన్నే మార్చేసే గేమ్ ఛేంజర్ కాబోతోంది.

మహీంద్రా గత ఏడాది ఆగస్టులో విజన్ S, X, T, SXT అనే నాలుగు కాన్సెప్ట్ మోడళ్లను ఆవిష్కరించింది. ఇవన్నీ కంపెనీ ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసిన NU_IQ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉన్నాయి. ఈ ప్లాట్‌ఫామ్ మహీంద్రా నెక్స్ట్ జనరేషన్ కార్లకు పునాది కాబోతోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం, ఈ కాన్సెప్ట్ కార్ల ఆధారంగా తయారయ్యే ప్రొడక్షన్ మోడల్స్ 2027 నుంచి రోడ్లపైకి వస్తాయి. షోరూమ్‌లలోకి వచ్చేసరికి వీటి పేర్లు మారవచ్చు, కానీ డిజైన్, టెక్నాలజీ మాత్రం అదే రేంజ్‌లో ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది.

భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి మహీంద్రా మహారాష్ట్రలోని నాగ్పూర్‌లో ఏకంగా 1,500 ఎకరాల విస్తీర్ణంలో ఒక భారీ ప్లాంట్‌ను సిద్ధం చేస్తోంది. సుమారు రూ.15,000 కోట్ల పెట్టుబడితో నిర్మితమవుతున్న ఈ ప్లాంట్, పెట్రోల్-డీజిల్, ఎలక్ట్రిక్ వాహనాలను ఒకే చోట తయారు చేసే సామర్థ్యం కలిగి ఉంది. విజన్ X, విజన్ T మోడళ్లను ముందుగా చాకన్ ప్లాంట్‌లో తయారు చేసి, ఆ తర్వాత నాగ్పూర్‌కు మారుస్తారు. అయితే, లగ్జరీ సెడాన్ లేదా స్పోర్ట్స్ స్టైల్‌లో ఉండబోయే విజన్ S మాత్రం నేరుగా నాగ్పూర్ ప్లాంట్‌లోనే తయారవుతుంది.

మార్కెట్ ట్రెండ్‌ను బట్టి మహీంద్రా తన పంథాను మార్చుకుంది. ప్రస్తుతం భారత్‌లో 4 మీటర్ల కంటే ఎక్కువ పొడవున్న ఎస్‌యూవీలకు విపరీతమైన డిమాండ్ ఉంది (దాదాపు 60 శాతం వాటా). అందుకే విజన్ సిరీస్‌లో భాగంగా పెద్ద మరియు ప్రీమియం ఎస్‌యూవీలను తయారు చేయడంపై కంపెనీ ఫోకస్ పెట్టింది. అలాగే, ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో XUV700 EV వెర్షన్‌కు వస్తున్న రెస్పాన్స్ చూసి, ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 3,000 నుంచి 5,000 యూనిట్లకు పెంచాలని నిర్ణయించింది.

కేవలం ఇండియాలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటాలని మహీంద్రా భావిస్తోంది. దీనికోసం 2028 నుంచి లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ (LHD) మోడళ్లను ఉత్పత్తి చేయడం ప్రారంభించనుంది. తద్వారా అమెరికా, యూరోప్ వంటి అంతర్జాతీయ మార్కెట్లకు భారీగా ఎగుమతులు చేసే అవకాశం ఉంటుంది. ఈ వ్యూహాత్మక అడుగులతో మహీంద్రా రాబోయే ఐదేళ్లలో గ్లోబల్ ఎస్‌యూవీ మార్కెట్లో టాప్ ప్లేస్‌ను దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News