Mahindra XEV 9S : భారతదేశ ఎస్‌యూవీ మార్కెట్‌లో సంచలనం సృష్టించడానికి మహీంద్రా కంపెనీ సిద్ధంగా ఉంది. కంపెనీ తన కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయిన మహీంద్రా XEV 9Sను నవంబర్ 27న అధికారికంగా విడుదల చేయనుంది. ఈ కారు చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే ఇది భారతదేశంలో విడుదల కాబోతున్న మొదటి 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. మహీంద్రా ప్రత్యేక ప్లాట్‌ఫామ్ అయిన INGLOపై దీనిని తయారు చేశారు. ఈ కారు మార్కెట్‌లోకి వస్తే ఎలక్ట్రిక్ ఫ్యామిలీ కార్లకు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది.
XEV 9S కారు ఇంటీరియర్ చాలా ప్రీమియంగా ఉంటుంది. సీట్లపై ఖరీదైన స్టిచింగ్, మెరుస్తున్న సిల్వర్ ప్లేట్లు, మెత్తగా ఉండే మెటీరియల్స్ వాడడం వల్ల లోపలి లుక్ చాలా లగ్జరీగా ఉంటుంది. ఇందులో ముఖ్యంగా పనోరమిక్ సన్‌రూఫ్, Harman Kardon కంపెనీకి చెందిన అత్యద్భుతమైన సౌండ్ సిస్టమ్, డాల్బీ అట్మాస్ సపోర్ట్, అవసరానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకునే పవర్ సీట్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. టెక్నాలజీ పరంగా చూస్తే, 360-డిగ్రీ కెమెరా, కారును ఫోన్ ద్వారా కంట్రోల్ చేసే ఫీచర్లు, రకరకాల డ్రైవింగ్ మోడ్‌లు ఇందులో ఉన్నాయి.
మహీంద్రా ఈ XEV 9S కోసం 79 kWh కెపాసిటీ గల పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను ఇవ్వొచ్చు. ఈ బ్యాటరీ కారణం ఈ ఎస్‌యూవీ ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఏకంగా 656 కిలోమీటర్ల వరకు వెళ్లగలదని అంచనా వేస్తున్నారు. ఈ సెగ్మెంట్‌లో ఇంత ఎక్కువ రేంజ్ ఇవ్వడం వల్ల, ఇది చాలా పవర్ఫుల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా నిలుస్తుంది. పెద్ద కుటుంబాలు సుదూర ప్రాంతాలకు వెళ్లడానికి ఈ XEV 9S చాలా మంచి ఆప్షన్ అవుతుంది.
XEV 9S ఖచ్చితమైన ధరను మహీంద్రా లాంచ్ రోజున ప్రకటిస్తుంది. అయితే మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం.. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.20 లక్షల వరకు ఉండవచ్చు. ప్రస్తుతం భారతదేశంలో దీనికి నేరుగా 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రూపంలో పోటీ లేదు. అయినప్పటికీ ఇది త్వరలో రాబోయే టాటా సియెర్రా ఈవీ, టాటా హారియర్ ఈవీ, కియా కారెన్స్ క్లావిస్ ఈవీ వంటి కార్ల నుంచి గట్టి పోటీని ఎదుర్కోవచ్చు.