Mahindra : మహీంద్రా నుంచి డబుల్ ధమాకా..సరికొత్త హంగులతో రాబోతున్న బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీలు.
Mahindra : మహీంద్రా అభిమానులకు ఇది అదిరిపోయే వార్త. భారతీయ ఎస్‌యూవీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా, తన బెస్ట్ సెల్లింగ్ మోడల్స్ అయిన స్కోర్పియో-ఎన్, థార్ 3-డోర్ వేరియంట్లను సరికొత్త హంగులతో మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమైంది. 2026 క్యాలెండర్ సంవత్సరంలో ఈ రెండు ఐకానిక్ ఎస్‌యూవీల ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లు విడుదల కానున్నట్లు కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. మహీంద్రా అండ్ మహీంద్రా ఆటో విభాగం సీఈఓ రాజేష్ జెజూరికర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2026లో కంపెనీ తన పాత బ్రాండ్లను కొత్త హంగులతో రీ-లాంచ్ చేయనుంది. ఇందులో ప్రధానంగా స్కోర్పియో-ఎన్, థార్ 3-డోర్ ఉండబోతున్నాయి. ఇదివరకే కంపెనీ XUV 7XO (XUV 700 రీబ్రాండెడ్ వెర్షన్), Bolero, Bolero Neo అప్‌డేట్లను పూర్తి చేసింది. ఇప్పుడు అందరి దృష్టి ఈ రెండు దిగ్గజాలపైనే ఉంది.
సరికొత్త మహీంద్రా స్కోర్పియో-ఎన్
స్కోర్పియో-ఎన్ ఇప్పుడు మరింత స్మార్ట్‌గా మారబోతోంది. దీని డిజైన్‌లో కొన్ని కీలక మార్పులు ఉండనున్నాయి. కొత్త డిజైన్ కలిగిన గ్రిల్, రీడిజైన్ చేసిన ఫ్రంట్ రియర్ బంపర్లు, సరికొత్త 5-స్పోక్ అల్లాయ్ వీల్స్ ఉండబోతున్నాయి. వెనుక వైపు ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్ మరింత స్టైలిష్‌గా కనిపిస్తాయి. క్యాబిన్‌లో పెద్ద మార్పులు రానున్నాయి. థార్ రాక్స్ నుంచి ప్రేరణ పొందిన 10.25 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, అప్‌డేటెడ్ సెంటర్ కన్సోల్ ఉండనున్నాయి. ఇంజిన్లలో మార్పు లేదు. 203 BHP పవర్ ఇచ్చే 2.0L టర్బో పెట్రోల్, 175 BHP పవర్ ఇచ్చే 2.2L డీజిల్ ఇంజిన్లు కొనసాగుతాయి.
అప్‌డేటెడ్ థార్ 3-డోర్
లైఫ్ స్టైల్ ఎస్‌యూవీగా పేరుగాంచిన థార్ 3-డోర్ ఇప్పుడు థార్ రాక్స్ ఫీచర్లను పుణికిపుచ్చుకోనుంది. ఇందులో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటో-ఫోల్డింగ్ ORVMs, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి లగ్జరీ ఫీచర్లు రాబోతున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా ADAS లెవల్ 2 సేఫ్టీ సూట్ కూడా ఇందులో వచ్చే అవకాశం ఉంది. థార్ రాక్స్‌లో ఉన్నట్లుగా సి-షేప్డ్ డిఆర్‌ఎల్స్, ఎల్‌ఈడీ హెడ్ లైట్లు, 19-ఇంచుల అల్లాయ్ వీల్స్‌తో ఇది కొత్త గ్లామర్ పొందుతుంది.
ఎలక్ట్రిక్ రంగంలోనూ జోరు
కేవలం పెట్రోల్-డీజిల్ వాహనాలే కాకుండా, ఎలక్ట్రిక్ విభాగంలోనూ మహీంద్రా దూసుకుపోతోంది. ఇప్పటికే XEV 9e, BE 6 మోడళ్లను విడుదల చేసిన మహీంద్రా, 2026 చివరి నాటికి మరిన్ని ఈవీ అప్‌డేట్లను సిద్ధం చేస్తోంది. అయితే ప్రస్తుతానికి కంపెనీ ఫోకస్ మాత్రం తన బెస్ట్ సెల్లింగ్ ఐసిఈ వాహనాలపైనే ఉంది.