మామిడిపండ్లను (Magoes) లొట్టలేసుకుంటూ లాగించేద్దామని ఎదురుచూస్తున్న వారికి ఓ తియ్యటి వార్త. ఈసారి కావాల్సినన్ని మామిడిపండ్లు మన మార్కెట్లలోకి రాబోతున్నాయట!! ఓ రకంగా జనం ఈసారి మామిడి పండ్ల జాతరను చూడబోతున్నారట..!! దేశవ్యాప్తంగా మామిడి పండ్ల దిగుబడి పెరగనుందని నిపుణులు చెబుతున్న అభిప్రాయాలే ఇందుకుకారణం. గతేడాదితో పోలి స్తే ఈసారి మామిడి దిగుబడి 14%పెరిగే అవకాశం ఉందని ఐసీఏఆర్–సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సబ్‌ట్రాపికల్ హార్టికల్చర్ డైరెక్టర్ టీ దామోదరన్ బుధవారం వెల్లడించారు.
2022–23 వ్యవసాయ సంవత్సరం(జూలై–జూన్)లో 2.1 కోట్ల టన్నులున్న మామిడి దిగుబడి 2023–24లో 2.4కోట్ల టన్నులకు పెరిగే అవకాశం ఉందన్నారు. ఇక, భారత వాతావరణ విభాగం అంచనాల ప్రకారం ఈఏడాది ఏప్రిల్–మే నెలల్లో 10–20 రోజులు తీవ్రమైన వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే మామిడి దిగుబడిపై ఎలాంటి ప్రభావం చూపవని దామోదరన్ తెలిపారు.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం కాయలు పండ్లుగా మారే దశలో సాగు ఉందని.. అందువల్ల సాధారణ వడగాడ్పు లు పంట దిగుబడిపై ప్రభావం చూపవని, పంటకు పరోక్షంగా మేలు చేస్తాయ న్నారు. కాగా, దక్షిణాది రాష్ట్రాల్లో మామిడి సాగు చాలా ఎక్కువ. దేశ మొత్తం దిగుబడిలో ఈ రాష్ట్రాల వాటా 50% వరకు ఉంటుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో దక్షిణాదిలో గతేడాది 15% పంట నష్టం జరిగింది. ఈ ఏడాది మాత్రం అలాంటి పరిస్థితులు కనిపించడం లేదని దామోదరన్ తెలిపారు.