Share Market Crash : దలాల్ స్ట్రీట్‌లో బ్లాక్ మండే.. 1600 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్.. హడలిపోతున్న ఇన్వెస్టర్లు.

Update: 2026-04-13 15:45 GMT

Share Market Crash : పశ్చిమ ఆసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో భారతీయ స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. అమెరికా, ఇరాన్ మధ్య ముదిరిన ఉద్రిక్తతలు దలాల్ స్ట్రీట్‌ను అతలాకుతలం చేశాయి. వారీ మొదటి రోజే (సోమవారం) ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోగా, మార్కెట్ అంతా ఎటు చూసినా ఎరుపు రంగులోనే కనిపిస్తోంది. యుద్ధ భయంతో ఒక్క రోజే ఏకంగా రూ.8.31 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సొమ్ము గాలిలో కలిసిపోయింది. ఈరోజు మార్కెట్ పతనంలో బ్యాంకింగ్ రంగం తీవ్రంగా నష్టపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉండే బ్యాంకులు, ఆటోమొబైల్, ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీల షేర్లు కుప్పకూలాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులైన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ 4 శాతం పడిపోగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ షేర్లు 3 శాతానికి పైగా నష్టపోయాయి. కేవలం బ్యాంకులు మాత్రమే కాకుండా మారుతీ సుజుకీ, ఐషర్ మోటార్స్ వంటి ఆటో దిగ్గజాలు, బీపీసీఎల్ (BPCL), ఇండియన్ ఆయిల్ (IOC) వంటి చమురు కంపెనీల షేర్లు కూడా భారీగా పతనమయ్యాయి.

సోమవారం ఉదయం మార్కెట్ మొదలవ్వక ముందే పరిస్థితి చేయి దాటిపోయిందని అర్థమైంది. ప్రీ-ఓపెనింగ్ సెషన్‌లోనే సెన్సెక్స్ 1,926 పాయింట్లు పడిపోయి 75,623 స్థాయికి పడిపోగా, నిఫ్టీ ఏకంగా 686 పాయింట్లు నష్టపోయి 23,364 వద్ద ట్రేడ్ అయింది. ఇది ఇన్వెస్టర్లలో పెను ప్రకంపనలు సృష్టించింది. ట్రేడింగ్ ప్రారంభం కాగానే సెన్సెక్స్ 1,600 పాయింట్ల (2.07%) పతనంతో 75,944 వద్ద, నిఫ్టీ 476 పాయింట్ల నష్టంతో 23,574 వద్ద కదలాడుతున్నాయి.

మార్కెట్ ఈ స్థాయిలో పడిపోవడానికి ప్రధాన కారణం ముడిచమురు ధరలు పెరగడమే. అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు విఫలం కావడం, దానికి తోడు స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ప్రాంతంలో అమెరికా నౌకాదళం జోక్యం చేసుకుంటుందని డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలు మార్కెట్లను కుదిపేస్తున్నాయి. దీంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా 8 శాతం పెరిగి 100 డాలర్ల మార్కును దాటేసింది. ప్రపంచ చమురు వ్యాపారంలో 20 శాతం ఈ సన్నని సముద్ర మార్గం నుంచే జరుగుతుంది కాబట్టి, అక్కడ యుద్ధ వాతావరణం ఉంటే సరఫరా నిలిచిపోతుందన్న భయం ఇన్వెస్టర్లను వెంటాడుతోంది.

మన దేశం తన చమురు అవసరాల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతుంది. ఒకవేళ చమురు ధరలు ఇలాగే పెరిగితే.. పెట్రోల్, డీజిల్ రేట్లు ఆకాశాన్ని తాకుతాయి. ఫలితంగా రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ప్రియమవుతాయి. ఇది ద్రవ్యోల్బణానికి దారితీసి సాధారణ ప్రజలపై భారంగా మారుతుందన్న ఆందోళనతో ఇన్వెస్టర్లు తమ షేర్లను భారీగా అమ్ముకుంటున్నారు. ఈ యుద్ధం ఆగి, ధరలు తగ్గే వరకు మార్కెట్ మళ్లీ కోలుకోవడం కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News