Maruti S-Presso : మారుతి బంపర్ ఆఫర్..ఎస్-ప్రెస్సోపై రూ.1.30 లక్షల తగ్గింపు.. ఇంకా ఉన్నాయ్.

Update: 2025-10-15 10:45 GMT

Maruti S-Presso : ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన పాపులర్ మైక్రో ఎస్‌యూవీ ఎస్-ప్రెస్సో ధరలను భారీగా తగ్గించింది. ముఖ్యంగా జీఎస్టీ తగ్గింపు తర్వాత, దీపావళికి ముందే ఈ కారు ధర ఏకంగా రూ. 1.30 లక్షల వరకు తగ్గింది. జీఎస్టీ తగ్గింపునకు ముందు వరకు మారుతి ఆల్టో కే10 దేశంలోనే అత్యంత చవకైన కారుగా ఉండేది, కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని మారుతి ఎస్-ప్రెస్సో భర్తీ చేసింది. ప్రస్తుతం ఈ నెలలో ఈ కారుపై ఏకంగా రూ.47,500 వరకు అదనపు బెనిఫిట్స్ కూడా అందిస్తున్నారు.

మారుతి ఎస్-ప్రెస్సో కారు కొత్త ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు రూ.3.49 లక్షలుగా ఉంది. దీని టాప్-ఎండ్ వేరియంట్ ధర గతంలో రూ.6.12 లక్షలు ఉండగా, ఇప్పుడు ఏకంగా రూ.5.25 లక్షల ఎక్స్-షోరూమ్‌కు తగ్గింది. మారుతి అరీనా ద్వారా విక్రయించబడే ఈ హ్యాచ్‌బ్యాక్ కారు మైక్రో-ఎస్‌యూవీ తరహా డిజైన్‌తో వస్తుంది. ధరల తగ్గింపు, అదనపు బెనిఫిట్స్ కారణంగా తక్కువ బడ్జెట్‌లో కొత్త కారు కొనాలని చూస్తున్న వారికి ఇది చాలా మంచి అవకాశం.

మారుతి ఎస్-ప్రెస్సో మొత్తం 8 వేరియంట్లలో లభిస్తుంది, ఇందులో బేస్ మోడల్ STD నుంచి టాప్ వేరియంట్ VXI CNG కూడా ఉంది. ఈ కారులో 1-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 68PS పవర్, 90Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది. అయితే, సీఎన్‌జీ వెర్షన్ కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తుంది. మారుతి ఎస్-ప్రెస్సో పెట్రోల్ వేరియంట్‌లో లీటరుకు 24.12 నుంచి 25.30 కి.మీ వరకు, సీఎన్‌జీ వేరియంట్‌లో కిలోకు 32.73 కి.మీ వరకు అద్భుతమైన మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

మారుతి ఎస్-ప్రెస్సోలో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కీ లెస్ ఎంట్రీ, సెమీ-డిజిటల్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ సెన్సార్‌లు, హిల్ హోల్డ్ అసిస్ట్, ABS+EBD వంటి ఫీచర్లు ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లో మంచి మైలేజ్, ఫీచర్లు కోరుకునే వారికి ఎస్-ప్రెస్సో మంచి ఆప్షన్. మార్కెట్‌లో ఇది రెనాల్ట్ క్విడ్, టాటా టియాగో వంటి ఎంట్రీ లెవల్ కార్లకు గట్టి పోటీ ఇస్తుంది.

Tags:    

Similar News