Maruti Suzuki e-Vitara Price : ఒక్కసారిగా హీటెక్కిన ఈవీ మార్కెట్..మారుతి సుజుకి ఈ-విటారా ధర లీక్?

Update: 2026-02-14 09:32 GMT

Maruti Suzuki e-Vitara Price : భారతీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి తన తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈ-విటారాతో ఈవీ రంగంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. గతేడాది ఆటో ఎక్స్‌పోలో దీనిని ప్రదర్శించినప్పటి నుంచి కస్టమర్లలో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లీకుల ప్రకారం.. దీని బేస్ వేరియంట్ ధర సుమారు రూ.24.79 లక్షల నుంచి ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మారుతి ఈ కారును ప్రీమియం సెగ్మెంట్లో టాటా కర్వ్ ఈవీ, ఎంజీ జెడ్ఎస్ ఈవీలకు గట్టి పోటీగా నిలబెట్టబోతోందని స్పష్టమవుతోంది.

ఈ-విటారా లోపలి భాగం చాలా విలాసవంతంగా ఉంటుంది. ఇందులో వైర్‌లెస్ ఛార్జర్, వెంటిలేటెడ్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, అంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఇన్ఫినిటీ ప్రీమియం సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్ ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తాయి. కేబిన్‌లో హై-క్వాలిటీ మెటీరియల్ వాడటంతో పాటు గ్లోస్ బ్లాక్ టచ్ ఇవ్వడం వల్ల ఇది చాలా ప్రీమియం లుక్‌ను ఇస్తుంది.

ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ప్రధానంగా రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో రానుంది. అవి 49kWh, 61kWh. పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా ఇందులో ఈకో, నార్మల్, స్పోర్ట్ అనే డ్రైవింగ్ మోడ్స్ తో పాటు మంచు కురిసే దారుల్లో సులభంగా వెళ్లేందుకు స్నో మోడ్ కూడా ఉండటం విశేషం. ఇది అన్ని రకాల వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా రూపొందించబడింది.

సేఫ్టీ విషయంలో మారుతి సుజుకి ఈసారి ఎక్కడా తగ్గలేదు. ఈ-విటారా లో లెవల్ 2 ADAS ఫీచర్లు ఉన్నాయి. ఇందులో లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటివి డ్రైవింగ్‌ను సులభతరం చేస్తాయి. దీంతో పాటు 7 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, బ్లైండ్ స్పాట్ మానిటర్ వంటి అధునాతన భద్రతా ఫీచర్లు ఇందులో ఉన్నాయి. భారత్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్టుల్లో ఇది 5-స్టార్ రేటింగ్ సాధించడం ఈ కారుపై నమ్మకాన్ని మరింత పెంచుతోంది.

Tags:    

Similar News