New Electric SUVs : నవంబర్, డిసెంబర్ 2025లో లాంచ్ కానున్న కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు ఇవే.
New Electric SUVs : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ ఊపందుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కేవలం ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్యే లక్షకు పైగా ఈవీలు రిజిస్టర్ అయ్యాయి. ఇది గత ఏడాది కంటే దాదాపు రెట్టింపు. ఈ పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా, ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు ముఖ్యంగా ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అనేక కొత్త మోడళ్లను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. మీరు కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కొనుగోలు చేయాలని అనుకుంటే మరికొన్ని నెలలు ఆగితే మేలు, ఎందుకంటే త్వరలో మారుతి సుజుకి, టాటా, మహీంద్రా నుంచి మూడు అద్భుతమైన కొత్త మోడల్స్ మార్కెట్‌లోకి రాబోతున్నాయి.
మారుతి సుజుకి ఈ-విటారా
మారుతి సుజుకి సంస్థ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయిన ఈ-విటారాతో ఈవీ రంగంలోకి అడుగుపెడుతోంది. దీని అమ్మకాలు డిసెంబర్ 2, 2025 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ కారు రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తుంది. 49kWh, 61kWh. ఇవి ఫ్రంట్ యాక్సిల్‌పై ఉన్న ఎలక్ట్రిక్ మోటార్‌కు అనుసంధానించబడి ఉంటాయి. మారుతి సంస్థ అధికారికంగా ధృవీకరించిన ప్రకారం.. ఈ-విటారా ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 500 కి.మీ కంటే ఎక్కువ రేంజ్‌ను అందిస్తుంది.పెద్ద బ్యాటరీ కలిగిన వేరియంట్‌లలో డ్యుయల్ మోటార్ సెటప్, ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంటుంది.
టాటా సియెర్రా ఈవీ
టాటా మోటార్స్ తన ఐకానిక్ పేరు సియెర్రాను ఎలక్ట్రిక్ రూపంలో తిరిగి తీసుకురాబోతోంది. టాటా సియెర్రా ఈవీ అధికారిక స్పెసిఫికేషన్లు నవంబర్ 25, 2025 న దీని ఆవిష్కరణ సందర్భంగా విడుదల కానున్నాయి. ఇది టాటా హారియర్ ఈవీలో ఉపయోగించిన పవర్‌ట్రైన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఇది 65kWh, 75kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభిస్తుంది. హారియర్ ఈవీ 627 కి.మీ MIDC రేంజ్ అందిస్తున్న నేపథ్యంలో, సియెర్రా ఈవీ కూడా 500 కి.మీ కంటే ఎక్కువ రేంజ్‌ను అందించగలదని భావిస్తున్నారు. 75kWh బ్యాటరీ ప్యాక్‌లో 158PS ఫ్రంట్ మోటార్, 65kWh బ్యాటరీ ప్యాక్‌లో 238PS రియర్ మోటార్ వచ్చే అవకాశం ఉంది.
మహీంద్రా XEV 9S
మహీంద్రా నుంచి రాబోతున్న 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయిన XEV 9S ఇప్పటికే భారీ అంచనాలను సృష్టించింది. ఇది నవంబర్ 27, 2025న విడుదల కానుంది. ఈ కారు XEV 9e తో డిజైన్, ప్లాట్‌ఫారమ్, పవర్‌ట్రైన్‌ను పంచుకుంటుంది. ఇది 59kWh, 79kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో రానుంది. టాప్ వేరియంట్ 600 కి.మీ కంటే ఎక్కువ రేంజ్ ఇచ్చే అవకాశం ఉంది. అధికారిక టీజర్ల ద్వారా ఫీచర్లలో ట్రిపుల్ స్క్రీన్ సెటప్, హర్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్, స్లైడింగ్ రెండవ వరుస సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, మెమరీ ఫంక్షన్‌తో కూడిన పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు ఉన్నాయి.