Maruti WagonR : కింగ్ ఆఫ్ ఇండియన్ రోడ్స్..4 ఏళ్లుగా నంబర్ 1..ఎన్ని వచ్చినా దీనికి ఎదురు లేదు.

Update: 2025-11-28 11:00 GMT

Maruti WagonR : మారుతి సుజుకి సంస్థ 1999లో భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టిన కారు వాగన్ఆర్. అప్పటి నుంచి ఈ టాల్ బాయ్ హ్యాచ్‌బ్యాక్ అనేక రకాల కొత్త మోడళ్లతో పోటీపడి, ఇప్పటికీ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. 2025లో కూడా వాగన్ఆర్ తన అద్భుతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. కొత్త గణాంకాల ప్రకారం వాగన్ఆర్ ఆర్థిక సంవత్సరం 2024-25లో 1.98 లక్షలకు పైగా యూనిట్ల అమ్మకాలతో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా రికార్డు సృష్టించింది. గత నాలుగు సంవత్సరాలుగా నంబర్ 1 స్థానంలో నిలవడం ఈ కారు స్థిరమైన ప్రజాదరణకు నిదర్శనం. లగ్జరీ సెడాన్‌లు, ఎస్‌యూవీలు మార్కెట్‌ను ఏలుతున్న సమయంలో కూడా, ఒక సాధారణ హ్యాచ్‌బ్యాక్ అగ్రస్థానంలో ఉండటం విశేషం.

వాగన్ఆర్ ఇంత విజయవంతం కావడానికి ప్రధాన కారణం దాని టాల్ బాయ్ డిజైన్. చిన్న సైజులో ఉన్నప్పటికీ నిటారుగా ఉండే ఈ డిజైన్ కారణంగా కారు లోపల ప్రయాణికులకు ఎక్కువ స్థలం లభిస్తుంది. మధ్యతరగతి ప్రజలలో ఇది త్వరగా ప్రాచుర్యం పొందింది. మారుతి సుజుకి నివేదిక ప్రకారం.. ఇప్పటివరకు మూడు తరాలకు చెందిన 33.70 లక్షలకు పైగా వాగన్ఆర్ మోడళ్లు అమ్ముడయ్యాయి. ఈ కారు FY 2024-25లో 1.98 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడై గత నాలుగు సంవత్సరాలుగా దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది.

వాగన్ఆర్ తన 25 ఏళ్ల ప్రయాణంలో మార్కెట్‌లో గట్టి పోటీ ఇచ్చిన అనేక కార్లను ఓడించి, విజయవంతమైంది.

హ్యుందాయ్ శాంట్రో : 1998లో వాగన్ఆర్ కంటే ముందే శాంట్రో వచ్చింది. ఇది కూడా టాల్-బాయ్ హ్యాచ్‌బ్యాక్‌గా మంచి పేరు తెచ్చుకుంది. దశాబ్దాల పాటు ఈ రెండింటి మధ్య తీవ్ర పోటీ నడిచింది. శాంట్రో కొంచెం ప్రీమియం లుక్ అందించగా, వాగన్ఆర్ తక్కువ ధర, మారుతి విశ్వసనీయతతో ఆకర్షించింది. తక్కువ అమ్మకాల కారణంగా శాంట్రోను 2015లో ఒకసారి, 2018లో తిరిగి వచ్చిన తర్వాత 2022లో మరోసారి శాశ్వతంగా నిలిపివేశారు.

టాటా మోటార్స్ ఇండికా : వాగన్ఆర్‌కు మరో ముఖ్యమైన పోటీదారు టాటా ఇండికా. ఇండికా మరింత పవర్ఫుల్ ఇంజిన్, విశాలమైన క్యాబిన్‌ను కలిగి ఉండేది. ప్రారంభంలో వాగన్ఆర్ కంటే తక్కువ ధరకే లభించేది. అనేక మార్పులు, డీజిల్ ఇంజిన్ ఆప్షన్ ఉన్నప్పటికీ, వాగన్ఆర్ ఆకర్షణ ముందు ఇండికా నిలబడలేకపోయింది. 20 సంవత్సరాల ఉత్పత్తి తర్వాత 2018లో దీని ఉత్పత్తిని నిలిపివేశారు.

ఫియట్ ఊనో : 1990ల చివర్లో భారత మార్కెట్లోకి వచ్చిన మరో కారు ఫియట్ ఊనో. అంతర్జాతీయ మార్కెట్‌లో గుర్తింపు ఉన్నప్పటికీ, భారతీయ కస్టమర్లను ఇది ఆకట్టుకోలేకపోయింది. ఉత్పత్తి సమస్యలు, తక్కువ అమ్మకాల కారణంగా 2000ల ప్రారంభంలో దీని ఉత్పత్తిని నిలిపివేశారు.

దేవూ మ్యాటిజ్ : 1998లో వాగన్ఆర్ కంటే ముందు వచ్చిన దేవూ మ్యాటిజ్ ఆ సమయంలో కొంచెం అప్‌మార్కెట్, ఆకర్షణీయమైన ఎంపికగా ఉండేది. అయితే 1999లో వచ్చిన వాగన్ఆర్ తన జపనీస్ క్వాలిటీ, ఎక్కువ స్థలం, ఫీచర్లతో మ్యాటిజ్‌ను వెనక్కి నెట్టింది. 2002లో దేవూ దివాలా తీయడంతో మ్యాటిజ్ కథ ముగిసింది.

వాగన్ఆర్ తన పోటీదారులందరినీ అధిగమించి, భారతదేశపు లాంగ్-లాస్టింగ్ ఫ్యామిలీ కారుగా స్థిరపడింది. దీని విజయం కేవలం అమ్మకాల సంఖ్యకు మాత్రమే పరిమితం కాదు.. తక్కువ నిర్వహణ ఖర్చు, అద్బుతమైన మైలేజీ, మారుతి సుజుకి విస్తృతమైన సర్వీస్ నెట్‌వర్క్, నమ్మదగిన ఇంజిన్ వంటి అంశాలు వాగన్ఆర్ దీర్ఘకాలిక విజయానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.

Tags:    

Similar News