Personal Loans : పర్సనల్ లోన్ల వెనుక దాగి ఉన్న కన్నీటి గాథ..వైద్య ఖర్చుల కోసం తప్పని తిప్పలు.
Personal Loans : సాధారణంగా పర్సనల్ లోన్ అనగానే మనకు ఏ ట్రిప్పులకో, ఖరీదైన గ్యాడ్జెట్ల కోసమో తీసుకుంటారని అనిపిస్తుంది. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. భారతీయులు తమ సరదాల కోసం కంటే, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు వైద్య ఖర్చుల కోసమే ఎక్కువగా అప్పులు చేస్తున్నారని తాజా నివేదికలు చెబుతున్నాయి. పైసాబజార్ విడుదల చేసిన ద పర్సనల్ లోన్ స్టోరీ అనే కన్స్యూమర్ రీసెర్చ్ రిపోర్ట్ మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక కష్టాలను కళ్లకు కట్టింది.
మన దేశంలో పర్సనల్ లోన్ల వినియోగంపై పైసాబజార్ సంస్థ జరిపిన తాజా సర్వేలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో పర్సనల్ లోన్లు తీసుకునే వారిలో దాదాపు 11 శాతం మంది కేవలం మెడికల్ ఎమర్జెన్సీ కోసం, అంటే ఆసుపత్రి ఖర్చుల కోసమే అప్పులు చేస్తున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడం లేదా ఉన్న పాలసీలు భారీ ఖర్చులకు సరిపోకపోవడం వల్ల సామాన్యులు బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. దేశంలో వైద్యం ఎంత భారంగా మారిందో చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనం.
ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఈ నగరాల్లో మెడికల్ ఎమర్జెన్సీ కోసం లోన్లు తీసుకునే వారు 14 శాతానికి చేరుకున్నారు. చిన్న పట్టణాలతో పోలిస్తే పెద్ద నగరాల్లో వైద్య ఖర్చులు ఎక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. మరోవైపు, అప్పు తీసుకునే వారిలో అత్యధికంగా 48 శాతం మంది తమ ఇంటి అవసరాల కోసం లేదా అకస్మాత్తుగా వచ్చే ఇంటి రిపేర్ల కోసం లోన్ తీసుకుంటున్నారు. అంటే తలదాచుకునే చోటును పదిలపరుచుకోవడానికి కూడా భారతీయులు అప్పులపైనే ఆధారపడుతున్నారు.
ఇక లైఫ్ స్టైల్ అప్‌గ్రేడ్ కోసం.. అంటే విలాసవంతమైన వస్తువులు లేదా ఇతర సౌకర్యాల కోసం 36 శాతం మంది లోన్లు తీసుకుంటుండగా, సొంత వ్యాపారాలను విస్తరించుకోవడానికి 16 శాతం మంది అప్పు చేస్తున్నారు. ఈ సర్వేలో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఏడాదికి రూ.7.5 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య ఆదాయం ఉన్న మధ్యతరగతి ప్రజలు తమ కోరికలను తీర్చుకోవడానికి ఎక్కువగా లోన్లు తీసుకుంటున్నారు. ఈ ఆదాయ వర్గంలోని వారు దాదాపు 40 శాతం వరకు తమ లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి అప్పు చేయడానికి వెనుకాడటం లేదు.
చిన్న పట్టణాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడ ప్రజలు తమ రోజువారీ ఖర్చుల కోసం కూడా పర్సనల్ లోన్లపై ఆధారపడుతున్నారు. పెద్ద నగరాలతో పోలిస్తే చిన్న పట్టణాల్లో రోజువారీ అవసరాల కోసం లోన్ తీసుకునే అవకాశం 2.4 రెట్లు ఎక్కువగా ఉంది. పైసాబజార్ సీఈఓ సంతోష్ అగర్వాల్ అభిప్రాయం ప్రకారం.. ఇప్పుడు ప్రజలు కేవలం వడ్డీ రేట్లను మాత్రమే చూడటం లేదు, తమ జీవితంలో ఎదురయ్యే అనివార్య పరిస్థితులు, అత్యవసర అవసరాలే వారిని అప్పుల వైపు నడిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ నివేదిక భారతీయ కుటుంబాల ఆర్థిక అభద్రతా భావాన్ని మరోసారి బయటపెట్టింది.