Medicine Prices : సామాన్యుడికి షాక్..పెరగనున్న మందుల ధరలు..ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి?

Update: 2025-12-26 09:00 GMT

Medicine Prices : సామాన్యుడికి గుండె కోత మిగిల్చే వార్త ఇది. ఇప్పటికే నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న ప్రజలపై ఇప్పుడు మందుల భారం కూడా పడేలా కనిపిస్తోంది. జ్వరం, జలుబు వంటి సాధారణ సమస్యల నుంచి ప్రాణాపాయ స్థితిలో వాడే యాంటీబయాటిక్స్ వరకు అన్నింటి ధరలు పెరిగే అవకాశం ఉందని ఫార్మా రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఒక నిర్ణయం మందుల తయారీ ఖర్చును పెంచి, అది చివరకు రోగుల జేబులకు చిల్లు పెట్టేలా ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.

వివరాల్లోకి వెళ్తే మందుల తయారీకి వాడే ముడి పదార్థాల దిగుమతిపై ప్రభుత్వం కనిష్ట దిగుమతి ధరను విధించాలని యోచిస్తోంది. ముఖ్యంగా యాంటీబయాటిక్స్ తయారీలో కీలకమైన పెన్సిలిన్-జితో పాటు 6-APA, అమోక్సిసిలిన్ వంటి పదార్థాలపై ఈ నిబంధన రానుంది. చైనా నుంచి చౌకగా వస్తున్న దిగుమతులను అడ్డుకుని, మన దేశీయ తయారీదారులను ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. అయితే ఈ నిర్ణయం వల్ల మందుల తయారీ ఖర్చు అమాంతం పెరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. పెన్సిలిన్-జి అనేది ఒక మదర్ మాలిక్యూల్ వంటిది. దీని నుంచి డజన్ల కొద్దీ యాంటీబయాటిక్స్ తయారవుతాయి. దీని ధర పెరిగితే మార్కెట్లో లభించే సాధారణ యాంటీబయాటిక్స్ అన్నీ ప్రియమవుతాయి.

ఈ ధరల పెరుగుదల ప్రభావం కేవలం ప్రైవేట్ మెడికల్ షాపులకే పరిమితం కాదు, ప్రభుత్వ ఆసుపత్రుల పంపిణీ వ్యవస్థపై కూడా తీవ్రంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలతో మందులను కొనుగోలు చేసి ప్రజలకు ఉచితంగా అందిస్తుంటాయి. ఇప్పుడు ముడి పదార్థాల ధరలు పెరిగితే, పాత ధరలకు మందులు సరఫరా చేయలేమని కంపెనీలు టెండర్ల నుంచి తప్పుకునే ప్రమాదం ఉంది. దీనివల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత ఏర్పడే అవకాశం ఉందని, పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం 2020లో చైనాపై ఆధారపడటం తగ్గించడానికి పీఎల్ఐ పథకాన్ని తెచ్చినప్పటికీ, దేశీయ ఉత్పత్తి సామర్థ్యం ఇంకా అవసరాలకు తగ్గట్టుగా పెరగలేదు.

నిజానికి దేశీయ పరిశ్రమను కాపాడటం మంచిదే అయినా, అది సామాన్యుడి ప్రాణాల మీదకు రాకూడదని నిపుణులు సూచిస్తున్నారు. దిగుమతులపై ఆంక్షలు విధించడం కంటే, మన దేశంలోనే తక్కువ ఖర్చుతో మందులు తయారయ్యేలా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని వారు కోరుతున్నారు. లేదంటే రాబోయే రోజుల్లో ఒక సాధారణ ఇన్ఫెక్షన్ వచ్చినా మందులు కొనాలంటే వేలకు వేలు ఖర్చు చేయాల్సి రావచ్చు. మందుల సరఫరాలో అంతరాయం కలగకుండా ప్రభుత్వం సమతుల్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Tags:    

Similar News