Mercedes-Benz VLE: మెర్సిడెజ్ నుంచి లగ్జరీ ఎలక్ట్రిక్ వ్యాన్.. 700 కి.మీ రేంజ్.. లోపల చూస్తే కళ్లు చెదరాల్సిందే.

Update: 2026-03-12 09:00 GMT

Mercedes-Benz VLE: లగ్జరీ కార్ల తయారీలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మెర్సిడెజ్-బెంజ్, భవిష్యత్తు ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సరికొత్త ఎలక్ట్రిక్ అద్భుతాన్ని ఆవిష్కరించింది. అదే మెర్సిడెజ్-బెంజ్ VLE. ఇది కేవలం ఒక ఎలక్ట్రిక్ వాహనం మాత్రమే కాదు, చక్రాలపై నడిచే ఒక విలాసవంతమైన రాజభవనం. పెద్ద కుటుంబాలు, ప్రీమియం షటిల్ సర్వీసుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ లగ్జరీ పీపుల్ మూవర్, బెంజ్ సెడాన్ కార్లలో ఉండే అన్ని రాజభోగాలను అందిస్తుంది.

రోడ్డుపై నడిచే సినిమా థియేటర్

ఈ కారు లోపలికి అడుగుపెడితే మనం ఏదో లగ్జరీ హోటల్ లాంజ్ లో ఉన్నామా అనే అనుభూతి కలుగుతుంది. ఇందులో ఎనిమిది మంది వరకు కూర్చునేలా సీటింగ్ అమర్చుకోవచ్చు. కేబిన్ మొత్తం హై-ఎండ్ మెటీరియల్స్, అద్భుతమైన లైటింగ్ తో మెరిసిపోతుంది. వెనుక సీట్లలో కూర్చునే ప్రయాణికుల కోసం ఏకంగా 31.3 అంగుళాల పనోరమిక్ డిస్‌ప్లే ఉంటుంది. దీని ద్వారా సినిమాలు చూడొచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు, అంతేకాదు ఆఫీస్ వీడియో మీటింగ్స్ లో కూడా పాల్గొనవచ్చు. ఆకాశం కనిపించేలా ఉండే పనోరమిక్ గ్లాస్ రూఫ్ ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తుంది.

రేంజ్, పర్ఫార్మెన్స్

ఎలక్ట్రిక్ కారు అనగానే అందరికీ ఉండే మొదటి టెన్షన్ చార్జింగ్. కానీ VLE విషయంలో ఆ చింతే అక్కర్లేదు. ఇందులో 115kWh భారీ బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఏకంగా 700 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం (WLTP) ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. అంతేకాదు, ఇందులోని 800-వోల్ట్ ఆర్కిటెక్చర్ వల్ల చార్జింగ్ చాలా వేగంగా అవుతుంది. కేవలం 15 నిమిషాల చార్జింగ్‌తో 355 కిలోమీటర్ల ప్రయాణం చేయవచ్చు. దీని అత్యంత పవర్‌ఫుల్ వెర్షన్ 409 hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది, పైగా ఇందులో 4MATIC ఆల్-వీల్ డ్రైవ్ సదుపాయం కూడా ఉంది.

టెక్నాలజీలో మొనగాడు

మెర్సిడెజ్-బెంజ్ తన సొంత ఆపరేటింగ్ సిస్టమ్ (MB.OS)ను ఇందులో ప్రవేశపెట్టింది. ఇది కారులోని ఇన్ఫోటైన్‌మెంట్ నుంచి డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్ల వరకు ప్రతి అంశాన్ని కంట్రోల్ చేస్తుంది. అంటే కారు అంతా మన వేలి చివరలపైనే ఉంటుందన్నమాట. సాంప్రదాయ వ్యాన్లలా కాకుండా, ఇది ప్రయాణికుల సౌకర్యానికి పెద్దపీట వేస్తుంది. మొత్తానికి, విలాసానికి సాంకేతికత తోడైతే ఎలా ఉంటుందో మెర్సిడెజ్ VLE అలా కనిపిస్తోంది.

Tags:    

Similar News