MG Majestor : ఫార్చ్యూనర్ కోటను పడగొట్టేందుకు వస్తున్న ఎంజీ మెజస్టర్..ఫిబ్రవరి 12న గ్రాండ్ ఎంట్రీ!

Update: 2026-01-21 07:45 GMT

MG Majestor : ఎంజీ మోటార్స్ తన గ్లోస్టర్ మోడల్‌ను మరింత అప్‌గ్రేడ్ చేసి, సరికొత్త పేరుతో మెజస్టర్‎గా భారత వినియోగదారుల ముందుకు తెస్తోంది. గతేడాది జరిగిన భారత్ మొబిలిటీ షోలో తొలిసారిగా తళుక్కుమన్న ఈ కారు, అప్పటి నుంచి వాహన ప్రియుల్లో భారీ అంచనాలను పెంచింది. ఫిబ్రవరి 12 నుంచి ఈ కారు షోరూమ్‌లలో సందడి చేయనుంది. ఇది కేవలం కారు మాత్రమే కాదు, రోడ్డుపై ఒక విలాసవంతమైన రాజభవనంలా కనిపిస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. దీని ధర సుమారు రూ.39.57 లక్షల నుంచి ప్రారంభమై రూ.44.03 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చని అంచనా.

డిజైన్, లుక్స్: మెజస్టర్ తన పాత వెర్షన్ గ్లోస్టర్ కంటే చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. దీనికి కొత్తగా డిజైన్ చేసిన గ్లాస్-బ్లాక్ గ్రిల్, వెర్టికల్ ఎల్‌ఈడీ హెడ్ ల్యాంప్స్, అద్భుతమైన ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్ ఉన్నాయి. 19 అంగుళాల డైమండ్-కట్ అలాయ్ వీల్స్ ఈ కారుకు మరింత రాజసాన్ని తెచ్చిపెట్టాయి. వెనుక భాగంలో కనెక్ట్ చేయబడిన ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్, రెండు వైపులా ఉన్న ఎగ్జాస్ట్ టిప్స్ ఈ ఎస్‌యూవీని స్పోర్టీగా మార్చాయి.

ప్రీమియం ఇంటీరియర్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ: కారు లోపలికి అడుగుపెడితే లగ్జరీకి కేరాఫ్ అడ్రస్‌లా ఉంటుంది. 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, 12-స్పీకర్ల హై-క్వాలిటీ సౌండ్ సిస్టమ్ ఇందులో ఉన్నాయి. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది డ్రైవర్ సీటు గురించి. ఇందులో పవర్ అడ్జస్ట్‌మెంట్‌తో పాటు హీటెడ్, కూల్డ్, మసాజ్ ఫంక్షన్ కూడా ఉంది. అంటే డ్రైవింగ్ చేస్తూనే మీరు రిలాక్స్ అవ్వొచ్చన్నమాట. సేఫ్టీ కోసం 360-డిగ్రీ కెమెరా, లెవల్-2 ADAS వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.

శక్తివంతమైన ఇంజిన్ : మెజస్టర్ కేవలం లుక్స్‌లోనే కాదు, పవర్‌లోనూ మొనగాడే. ఇందులో 2.0 లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 216 bhp పవర్, 479 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. కొండలు, కోనలు ఎక్కడానికి వీలుగా ఇందులో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఉంది. టయోటా ఫార్చ్యూనర్, స్కోడా కొడియాక్, జీప్ మెరిడియన్ వంటి గట్టి పోటీదారుల మధ్య మెజస్టర్ ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.

Tags:    

Similar News