MG Majestor vs Toyota Fortuner: ఆటోమొబైల్ రంగంలో ఇప్పుడు D+ సెగ్మెంట్ లగ్జరీ ఎస్‌యూవీల మధ్య పోరు రసవత్తరంగా మారింది. ఇప్పటి వరకు టయోటా ఫార్చ్యూనర్ ఏకఛత్రాధిపత్యం నడిచిన ఈ విభాగంలోకి ఇప్పుడు ఎంజీ మెజెస్టర్ ఎంట్రీ ఇచ్చింది. జేఎస్‌డబ్ల్యూ మోటార్ ఇండియా విడుదల చేసిన ఈ కారు, ఫార్చ్యూనర్‌కు గట్టి పోటీనిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అడ్వాన్స్‌డ్ ఫీచర్లు, అదిరిపోయే డిజైన్‌తో వచ్చిన ఈ రెండు దిగ్గజ ఎస్‌యూవీల మధ్య తేడాలేంటో వివరంగా తెలుసుకుందాం.
ఎంజీ మెజెస్టర్
ఎంజీ మోటార్స్ తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ గ్లోస్టర్ స్థానంలో మెజెస్టర్‌ను తీసుకొచ్చింది. ఈ కారు 5.04 మీటర్ల పొడవుతో రోడ్డు మీద భారీగా కనిపిస్తుంది. దీని ధరలు ఏప్రిల్ 2026లో ప్రకటించనున్నారు, అయితే అంచనా ప్రకారం ఇది రూ.40 లక్షల నుంచి రూ.45 లక్షల మధ్య ఉండవచ్చు. మే 2026 నుంచి కస్టమర్లకు డెలివరీలు అందనున్నాయి. ఇందులో 2.0 లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజిన్ ఉంది. ఇది 216 HP పవర్ మరియు 478 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ కారులో ర్యాక్, సాండ్, మడ్, స్నో వంటి అడ్వాన్స్‌డ్ 4x4 మోడ్స్ ఉన్నాయి.
లోపల చూస్తే ఇది ఒక ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపిస్తుంది. 12.3 ఇంచుల ట్విన్ స్క్రీన్ సెటప్, 12 స్పీకర్ల జేబీఎల్ ఆడియో సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, మసాజ్ ఫీచర్ ఉన్న సీట్లు ఇందులో హైలైట్. మెజెస్టర్‌లో ADAS Level 2 టెక్నాలజీ ఉంది. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, 360-డిగ్రీ కెమెరాతో ఇది అత్యంత సురక్షితమైన కారుగా నిలిచింది.
టయోటా ఫార్చ్యూనర్
ఇండియాలో ఫార్చ్యూనర్ అంటే ఒక స్టేటస్ సింబల్. దీని ధర రూ.34.16 లక్షల నుంచి రూ.51.44 లక్షల (GR-S వేరియంట్) వరకు ఉంటుంది. ఆఫ్-రోడింగ్ సామర్థ్యం, రిసేల్ వాల్యూలో దీనికి సాటి లేదు. ఫార్చ్యూనర్‌లో 2.7 లీటర్ పెట్రోల్, 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్లు అందుబాటులో ఉన్నాయి. డీజిల్ ఇంజిన్ 201 HP పవర్, 500 Nm టార్క్‌ను ఇస్తుంది. ఇప్పుడు ఇది 48V మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడా వస్తోంది, దీనివల్ల మైలేజీ, పికప్ మెరుగ్గా ఉంటుంది.
ఇందులో 8 ఇంచుల టచ్‌స్క్రీన్, జేబీఎల్ 11 స్పీకర్ సిస్టమ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే మెజెస్టర్‌తో పోలిస్తే ఇంటీరియర్ కొంచెం పాతదిగా అనిపించవచ్చు. ఇందులో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ (VSC), ట్రాక్షన్ కంట్రోల్, హిల్ అసిస్ట్ వంటి కీలక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
ఏది కొనడం బెటర్?
మీరు అత్యాధునిక టెక్నాలజీ, లగ్జరీ ఇంటీరియర్, ఎక్కువ ఫీచర్లు కోరుకునే వారైతే ఎంజీ మెజెస్టర్ అద్భుతమైన ఎంపిక. ముఖ్యంగా దీనిలోని ADAS, మసాజ్ సీట్లు మిమ్మల్ని ఫిదా చేస్తాయి. అలా కాకుండా ఆఫ్-రోడింగ్ సామర్థ్యం, ఇంజిన్ నమ్మకం, ఐదేళ్ల తర్వాత అమ్మినా మంచి రేటు రావాలనుకుంటే మాత్రం టయోటా ఫార్చ్యూనర్ వైపు మొగ్గు చూపవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ఫార్చ్యూనర్‌కు ఉన్న బ్రాండ్ ఇమేజ్ ఇప్పటికీ అగ్రస్థానంలోనే ఉంది.