MG Starlight 560 : భారీ చక్రాలు.. అదిరిపోయే డిజైన్.. ఎంజీ స్టార్‌లైట్ 560 ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే.
MG Starlight 560 :భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో ఎంజీ మోటార్ తన సరిహద్దులను శరవేగంగా విస్తరిస్తోంది. ఇటీవల విడుదలైన మెజెస్టర్ ఎస్‌యూవీ సృష్టించిన ప్రకంపనలు తగ్గకముందే, కంపెనీ మరో పవర్‌ఫుల్ మోడల్‌ను రంగంలోకి దించుతోంది. స్టార్‌లైట్ 560 పేరుతో రాబోతున్న ఈ కొత్త ఎస్‌యూవీ ప్రస్తుతం భారతీయ రోడ్లపై ముమ్మరంగా పరీక్షలు జరుపుకుంటోంది. ఇది నేరుగా మహీంద్రా XUV 7XO వంటి దిగ్గజాలకు నిద్రలేకుండా చేసేలా కనిపిస్తోంది. 2027 నాటికి అదిరిపోయే హైబ్రిడ్ మోడళ్లను తీసుకురావాలనే ఎంజీ మాస్టర్ ప్లాన్‌లో భాగంగానే ఈ కారు రాబోతోంది.
ఈ ఎస్‌యూవీ సైజు విషయానికొస్తే, ఇది సాధారణ మిడ్-సైజ్ ఎస్‌యూవీల కంటే చాలా భారీగా కనిపిస్తోంది. సుమారు 4.5 నుంచి 4.8 మీటర్ల పొడవుతో, రోడ్డుపై వెళ్తుంటే ఒక రాజసం ఉట్టిపడేలా దీని డిజైన్ ఉంది. కారు బాడీని పూర్తిగా కప్పి ఉంచి టెస్టింగ్ చేస్తున్నప్పటికీ, దాని భారీ రూపం మరియు స్ప్లిట్ హెడ్‌లైట్ సెటప్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. పైన సన్నని ఎల్‌ఈడీ లైట్లు, భారీ అలాయ్ వీల్స్, వెనుక వైపు ఉన్న కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు ఈ కారుకు ప్రీమియం లుక్‌ను ఇస్తున్నాయి.
లోపల స్పేస్ విషయంలో స్టార్‌లైట్ 560 తన ప్రత్యర్థులను మించిపోయింది. మహీంద్రా XUV 7XOతో పోలిస్తే, దీని వీల్‌బేస్ ఏకంగా 60 మి.మీ ఎక్కువగా ఉండటం గమనార్హం. దీనివల్ల కారు లోపల కాలు చాపుకుని ప్రశాంతంగా కూర్చునేంత స్పేస్ ప్రయాణికులకు లభిస్తుంది. క్యాబిన్ లోపల 12.8 ఇంచుల భారీ టచ్‌స్క్రీన్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, అత్యాధునిక అడాస్ సేఫ్టీ ఫీచర్లు ఉండబోతున్నాయి. అంటే ఇది కేవలం కారు మాత్రమే కాదు, చక్రాలపై నడిచే ఒక విలాసవంతమైన విల్లా అని చెప్పవచ్చు.
ఇంజిన్ సామర్థ్యం కూడా ఈ కారుకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. స్టార్‌లైట్ 560లో ప్యూర్ ఎలక్ట్రిక్ వెర్షన్‌తో పాటు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) ఆప్షన్ కూడా ఉండబోతోంది. గ్లోబల్ మార్కెట్ లెక్కల ప్రకారం, ఇది 197 BHP పవర్, 230 Nm టార్క్‌ను అందిస్తుంది. వేగంతో పాటు మైలేజీని కూడా బ్యాలెన్స్ చేయడంలో ఎంజీ ఈసారి పక్కా వ్యూహంతో వస్తోంది. 360-డిగ్రీ కెమె, ప్రీమియం ఇంటీరియర్స్‌తో వస్తున్న ఈ ఎస్‌యూవీ, భారతీయ ఎస్‌యూవీ మార్కెట్లో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.