Skoda Kylaq : 50 వేల మార్కును దాటేసిన స్కోడా కైలాక్..ఈ కారు కావాలంటే 6 వారాలు ఆగాల్సిందే.
Skoda Kylaq : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో తక్కువ బడ్జెట్‌లో లగ్జరీ అనుభూతిని అందించే కార్లకు డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. సరిగ్గా ఇదే పాయింట్‌ను క్యాచ్ చేసిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా, తన అత్యంత చవకైన ఎస్‌యూవీ కైలాక్‌తో సంచలనం సృష్టిస్తోంది. కేవలం రూ.7.59 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్లోకి వచ్చిన ఈ కారు, ఇప్పుడు హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది. తాజాగా ఈ మోడల్ ఉత్పత్తి 50,000 యూనిట్ల మైలురాయిని దాటేసిందంటేనే దీనికి ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. స్కోడా కైలాక్ డిజైన్, ధర చూసి ఫిదా అవుతున్న కస్టమర్లు షోరూమ్‌ల వద్ద క్యూ కడుతున్నారు. డిమాండ్ విపరీతంగా ఉండటంతో, ప్రస్తుతం ఈ కారును బుక్ చేసుకున్న వారు డెలివరీ కోసం కనీసం ఆరు వారాల (42 రోజులు) పాటు వేచి చూడాల్సి వస్తోంది. మీరు ఎంచుకునే వేరియంట్, రంగును బట్టి ఈ వెయిటింగ్ పీరియడ్ మారవచ్చు. డిమాండ్‌కు అనుగుణంగా ధరలను కూడా కంపెనీ స్వల్పంగా పెంచింది. ఎంపిక చేసిన కొన్ని వేరియంట్లపై గరిష్టంగా రూ. 33,000 వరకు ధర పెరిగినట్లు సమాచారం.
నాలుగు మీటర్ల లోపు పొడవు ఉన్న ఎస్‌యూవీలలో కైలాక్ తనదైన ముద్ర వేస్తోంది. ముఖ్యంగా దీని వీల్‌బేస్ సైజ్ పెద్దదిగా ఉండటం వల్ల వెనుక సీట్లో కూర్చునే ప్రయాణికులకు అద్భుతమై లెగ్‌రూమ్ లభిస్తుంది. ఇక ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 1.0 లీటర్ త్రీ-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 115 PS పవర్, 178 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంటే సిటీ రోడ్లపై హ్యాండ్లింగ్ చాలా స్మూత్‌గా ఉండటమే కాకుండా, హైవేలపై కూడా పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది.
సాధారణంగా కనిపించే డిజైన్లకు భిన్నంగా, కైలాక్‌లో యూరోపియన్ ఎలిగాన్స్ స్పష్టంగా కనిపిస్తుంది. వెడల్పాటి గ్రిల్, స్ప్లిట్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్ దీనికి స్పోర్టీ లుక్‌ను ఇస్తాయి. ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే, డ్యాష్‌బోర్డ్ డిజైన్ చాలా కొత్తగా ఉంటుంది. ఇందులో గ్లాస్ బ్లాక్ ఫినిషింగ్‌కు బదులుగా బ్యాంబూ ఫినిష్ (వెదురు వంటి డిజైన్) వాడటం విశేషం. డార్క్ కేబిన్ లోపల గ్రీన్ కలర్ డిజైన్ ఇన్సర్ట్‌లు కారుకు ఒక ప్రీమియం, ఫ్రెష్ ఫీలింగ్‌ను అందిస్తున్నాయి. త్వరలోనే ఇందులో స్పోర్ట్ లైన్ వేరియంట్ కూడా రాబోతుండటంతో కస్టమర్లు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.