కస్టమర్లకు మెరుగైన సేవలు అందించే దిశగా విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ వేగంగా విస్తరిస్తోంది. అందులో భాగంగా తన సర్వీస్ సెంటర్ల సామర్థ్యాన్ని 30శాతం పెంచుకున్నట్లు తెలుస్తోంది. కొత్తగా 50కు పైగా సర్వీస్ సెంటర్లను, 500 మంది టెక్నీషియన్లను పెంచుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. కస్టమర్ల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న తరుణంలో కంపెనీ కేంద్రాలను, శ్రామిక శక్తిని పెంచుకుంటోంది.‘కంపెనీ తన సర్వీస్ సెంటర్ల సామార్థ్యాన్ని విస్తరించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే మా వద్ద వచ్చిన అనేక సర్వీసు బ్యాక్‌లాక్‌లను పూర్తి చేశాం. రానున్న రోజుల్లో మిగిలిన వాటిని పూర్తి చేస్తాం’ అని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. మార్కెట్‌లో తన ఉనికిని పెంచుకోవడంలో భాగంగా ఈ ఏడాది సెప్టెంబర్‌తో ఓలా హైపర్ సర్వీస్ క్యాంపెయిన్ ను కంపెనీ ప్రారంభించింది. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా ఈఏడాది డిసెంబర్ నాటికి సర్వీస్ సెంటర్ల సంఖ్యను రెట్టింపు చేయాలని (1,000కి పెంచాలని) చూస్తున్నట్లు కంపెనీ సీఈఓ భవీశ్ అగర్వాల్ వెల్లడించారు.