Automatic Car : ఆటోమేటిక్ కారు గేర్ జామ్ అయిందా? కంగారు పడకండి..ఇలా చిటికెలో సరిచేయండి.

Update: 2026-02-17 08:15 GMT

Automatic Car : నేటి కాలంలో సౌకర్యం కోసం చాలా మంది ఆటోమేటిక్ కార్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ కార్లలో అప్పుడప్పుడు వచ్చే కొన్ని సాంకేతిక సమస్యలు డ్రైవర్లను బెంబేలెత్తిస్తుంటాయి. ముఖ్యంగా కార్ పార్కింగ్ మోడ్‌లో ఉన్నప్పుడు గియర్ లీవర్ ఒక్క అడుగు కూడా కదలక మొండికేస్తే.. ఆ టెన్షన్ మామూలుగా ఉండదు. అసలు ఆటోమేటిక్ కార్లలో గియర్ ఎందుకు జామ్ అవుతుంది? అలాంటి సమయంలో మెకానిక్ అవసరం లేకుండానే మనం చేయగలిగే చిన్న చిన్న చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

బ్రేక్ లైట్ వెలగకపోతే ప్రమాదమే

ఆటోమేటిక్ కార్లలో గేర్ మార్చాలంటే బ్రేక్ తొక్కడం తప్పనిసరి. మీరు బ్రేక్ తొక్కినట్లు కారులోని కంప్యూటర్ సిస్టమ్‌కు తెలియాలి. ఒకవేళ మీ కారు వెనుక ఉండే బ్రేక్ లైట్లు వెలగకపోతే, సిస్టమ్ మీరు బ్రేక్ తొక్కలేదని భావిస్తుంది. దీనివల్ల సేఫ్టీ ఫీచర్ యాక్టివేట్ అయ్యి గియర్ లాక్ అయిపోతుంది. బ్రేక్ స్విచ్ ఖరాబైనా లేదా వైరింగ్‌లో లోపం ఉన్నా గేర్ లీవర్ కదలదు. కాబట్టి గేర్ జామ్ అయినప్పుడు ఒకసారి బ్రేక్ లైట్లు చెక్ చేసుకోవడం మంచిది.

షిఫ్ట్ లాక్ రిలీజ్.. ఒక మ్యాజిక్ బటన్

చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. ప్రతి ఆటోమేటిక్ కారు గేర్ లీవర్ దగ్గర ఒక చిన్న రంధ్రం లేదా స్లాట్ ఉంటుంది. దీన్నే షిఫ్ట్ లాక్ రిలీజ్ అంటారు. గేర్ అస్సలు కదలని పక్షంలో, కారు చాబీని లేదా చిన్న స్క్రూ డ్రైవర్‌ను ఆ స్లాట్‌లో ఉంచి నెమ్మదిగా నొక్కాలి. అలా నొక్కి ఉంచి గేర్ లీవర్‌ను పార్కింగ్ నుంచి న్యూట్రల్‌కు మార్చవచ్చు. ఇది అత్యవసర పరిస్థితుల్లో కారును నెట్టుకుంటూ వెళ్లడానికో లేదా టోయింగ్ చేయడానికో బాగా ఉపయోగపడుతుంది.

వాలుగా ఉన్న రోడ్లపై జాగ్రత్త

మీరు కారును ఏదైనా కొండ ప్రాంతంలో లేదా వాలుగా ఉన్న రోడ్డుపై పార్క్ చేసినప్పుడు గేర్ జామ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. దీనికి కారణం కారు బరువు మొత్తం ట్రాన్స్‌మిషన్ మీద పడటమే. ఇలాంటి సమయంలో బలవంతంగా లీవర్‌ను లాగకూడదు. బ్రేక్ గట్టిగా నొక్కి పట్టి, కారును ఒకరు నెమ్మదిగా ముందుకు వెనక్కు ఊపాలి. ఇలా చేయడం వల్ల ట్రాన్స్‌మిషన్ మీద ఒత్తిడి తగ్గి గేర్ ఫ్రీ అవుతుంది. అందుకే వాలులో పార్క్ చేసేటప్పుడు ముందుగా హ్యాండ్ బ్రేక్ వేసి, ఆ తర్వాతే పార్కింగ్ మోడ్‌లోకి మార్చడం మంచి అలవాటు.

కారు నడుస్తుండగా గేర్ ఆగిపోయిందా?

కొన్నిసార్లు కారు నడుస్తుండగానే గేర్ ఏదో ఒక వేగంతో ఆగిపోతుంది. దీన్ని లింప్ మోడ్ అంటారు. కారు ఇంజిన్ లేదా గేర్ బాక్స్‌లో ఏదైనా పెద్ద సమస్య తలెత్తే అవకాశం ఉందని సెన్సార్లు గుర్తించినప్పుడు, కారు తనను తాను రక్షించుకోవడానికి ఈ మోడ్‌లోకి వెళ్తుంది. అంటే కారు ఇంజిన్ పాడవకుండా గేర్ బాక్స్‌ను లాక్ చేస్తుంది. ఇలా జరిగినప్పుడు కారును పక్కకు ఆపి, కాసేపు ఇంజిన్ ఆఫ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసి చూడండి. సమస్య పరిష్కారం కాకపోతే వెంటనే సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లడం ఉత్తమం.

Tags:    

Similar News