Royal Enfield Bullet 650 : బుల్లెట్ కా బాప్..ఇప్పుడు వరకు వచ్చిన వాటిలో ఇదే పవర్‌ఫుల్ బుల్లెట్.
Royal Enfield Bullet 650 : రాయల్ ఎన్‌ఫీల్డ్ అభిమానుల నిరీక్షణ ఫలించింది. దేశంలోనే నంబర్ 1 బైక్‌గా గుర్తింపు పొందిన బుల్లెట్ అత్యంత శక్తివంతమైన మోడల్ బుల్లెట్ 650 ఎట్టకేలకు గోవాలో జరిగిన మోటోవర్స్ ఫెస్టివల్‌లో భారతదేశంలో అడుగుపెట్టింది. అంతకుముందు ఇటలీలోని మిలన్‌లో జరిగిన EICMA 2025 లో దీన్ని ప్రదర్శించారు. ఈ బైక్ అధికారికంగా ఎప్పుడు విడుదల అవుతుందనే తేదీని కంపెనీ ఇంకా ప్రకటించనప్పటికీ, 2026 ప్రారంభంలో ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650, క్లాసిక్ మోడళ్ల మధ్య దీని ధర సుమారు రూ.3.40 లక్షల నుంచి ప్రారంభమవుతుందని అంచనా.
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 డిజైన్, స్టైలింగ్ విషయంలో బుల్లెట్ 350 ని చాలా పోలి ఉంటుంది. కానీ కొన్ని కొత్త హంగులు ఉన్నాయి. ఇందులో టైగర్-ఐ పైలట్ ల్యాంప్‌లతో కూడిన సిగ్నేచర్ సర్క్యులర్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్ ఉంటుంది. ఆర్ఈ బ్యాడ్జ్ తో పాటు చేతితో వేసిన పిన్‌స్ట్రైప్స్ ఉన్న టియర్‌డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్, సింగిల్-పీస్ సీటు, చతురస్రాకారపు వెనుక ఫెండర్, క్రోమ్ హ్యాండిల్‌బార్ దీని ప్రత్యేకతలు.
కొనుగోలుదారులు కానన్ బ్లాక్, బ్యాటిల్‌షిప్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. బుల్లెట్ 650ని ఈ రోజు వరకు వచ్చిన బుల్లెట్లలో అత్యంత పవర్‌ఫుల్ బైక్‌గా నిలిపేది దీని ఇంజిన్. ఇందులో 647.95 సీసీ, ట్విన్-సిలిండర్, ఇన్‌లైన్, 4-స్ట్రోక్ SOHC ఇంజిన్ ఉంది. ఇదే ఇంజిన్‌ను 650 సీసీ ట్విన్స్ మోడళ్లలో కూడా ఉపయోగిస్తారు. ఈ ఇంజిన్ 7,250 ఆర్‌పిఎం వద్ద గరిష్టంగా 47బీహెచ్పీ శక్తిని, 5,150 ఆర్‌పిఎం వద్ద 52.3 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6-స్పీడ్ కాన్‌స్టాంట్ మెష్, వెట్ మల్టీ-ప్లేట్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ అందించారు.
పాత బుల్లెట్ ఫీచర్లతో పాటు, బుల్లెట్ 650 లో ఆధునిక టెక్నాలజీ కూడా జోడించారు. ఈ బైక్ స్టీల్ ట్యూబ్యులర్ స్పైన్ ఫ్రేమ్‌పై ఆధారపడి ఉంది. ఇందులో ఫ్యూయల్ లెవెల్, గేర్ పొజిషన్, ట్రిప్ మీటర్, సర్వీస్ రిమైండర్ కోసం డిజిటల్ ఇన్సెట్‌తో కూడిన సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. యూఎస్‌బీ టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, అడ్జస్టబుల్ బ్రేక్/క్లచ్ లీవర్లు వంటి ఫీచర్లు ఉన్నాయి.
ముందు భాగంలో 19-అంగుళాలు, వెనుక భాగంలో 18-అంగుళాల స్పోక్ వీల్స్ ఉన్నాయి. బ్రేకింగ్ కోసం 320 మి.మీ ముందు డిస్క్, 300 మి.మీ వెనుక డిస్క్ బ్రేకులు, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్తో మెరుగయ్యాయి. సస్పెన్షన్‌లో 43 మి.మీ టెలిస్కోపిక్ ఫోర్క్, ట్విన్ షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి. ఈ బైక్ బరువు 243 కిలోలు, దీని ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 14.8 లీటర్లు.