Mukesh Ambani : రూ.5 కోట్లు రోజుకు ఖర్చు పెట్టినా.. తరగని ఖజానా.. 555 ఏళ్లు రానున్న తరాలకు చింతే లేదు.
Mukesh Ambani : రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఆస్తి గురించి తరచుగా వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం. ప్రపంచంలో 16వ అత్యంత ధనవంతుడైన అంబానీ నికర సంపద అంకెల్లో వినడానికి చాలా పెద్దగా ఉంటుంది. కానీ ఆ సంపద ఎంత పెద్దదో, దానికి సరిపోయే లెక్కను చూస్తే మన తల తిరగక మానదు. ముఖేష్ అంబానీ తన వ్యాపారం అంతా ఆపేసి ఒక్క పైసా కూడా సంపాదించకుండా కేవలం రోజుకు రూ.5 కోట్లు ఖర్చు చేస్తే, ఆ డబ్బు ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు వస్తుందో చూస్తే.. అపారమైన సంపద అంటే ఏంటో అర్థమవుతుంది. ఆ ఆశ్చర్యకరమైన లెక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచంలో 16వ అత్యంత ధనవంతుడిగా ఉన్న ముఖేష్ అంబానీ నికర సంపద అంకెల్లో చాలా పెద్దగా ఉంది. ముఖేష్ అంబానీ నికర సంపద 113.5 బిలియన్ డాలర్లు (ప్రస్తుత లెక్కల ప్రకారం). అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ. 10.14 లక్షల కోట్లు (రూ. 1,01,40,00,00,00,000). ఒకవేళ ముఖేష్ అంబానీ తన వ్యాపారం, పెట్టుబడులు, వడ్డీ, డివిడెండ్లు అన్నీ ఆపేసి, సంపాదన సున్నా అయ్యి, కేవలం రోజుకు రూ.5 కోట్లు ఖర్చు చేయడం మొదలుపెడితే అంబానీ సంపద తరగడానికి పట్టే సమయం అంచనాలకు అందనిది.
మొత్తం సంపద (రూ. 10.14 లక్షల కోట్లు)లో రోజువారీ ఖర్చు (రూ.5 కోట్లు)తో భాగించగా వచ్చే మొత్తం రోజులు 2,02,800. 2,02,800 రోజులను 365 రోజులతో భాగించి సంవత్సరాలలోకి మారిస్తే, వచ్చే ఫలితం 555 సంవత్సరాలు. అంటే, ముఖేష్ అంబానీ నేటి నుంచి రోజుకు రూ. 5 కోట్లు ఖర్చు చేసినా, ఆయన ఖజానా ఖాళీ అవడానికి ఐదు శతాబ్దాలకు పైగా పడుతుంది. ఆయన రాబోయే అనేక తరాలు ఎలాంటి పని చేయకుండానే రాజభోగాలు అనుభవించవచ్చు.
ఈ అపారమైన సంపద ఒక్క రాత్రిలో రాలేదు. దీని వెనుక ఒక సుదీర్ఘ పోరాటం, దూరదృష్టి ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు, ముఖేష్ అంబానీ తండ్రి అయిన ధీరూభాయ్ అంబానీ 1966లో చిన్న టెక్స్‌టైల్ తయారీదారుగా, దారాల వ్యాపారిగా ఈ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ధీరూభాయ్ అంబానీ మరణానంతరం (2002), వ్యాపార సామ్రాజ్యం ముఖేష్ అంబానీ, ఆయన సోదరుడు అనిల్ అంబానీ మధ్య విభజించబడింది.
ముఖేష్ అంబానీ పెట్రోకెమికల్స్, ఆయిల్, గ్యాస్ రిఫైనింగ్ వంటి ప్రధాన వ్యాపారాలను చేపట్టి, రిలయన్స్‌ను సరికొత్త శిఖరాలకు చేర్చారు. నేడు రిలయన్స్ వ్యాపారం కేవలం చమురుకే పరిమితం కాకుండా రిటైల్, మీడియా, టెలికాం (జియో), ఫైనాన్షియల్ సర్వీసెస్ వరకు విస్తరించి, 125 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది.