New-Gen Citroen e-C3 : పంచ్ ఈవీకి గట్టి పోటీ.. టెస్టింగ్‌లో సిట్రోయెన్ ఈ-సీ3 కొత్త మోడల్
New-Gen Citroen e-C3 : భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్‌లో సిట్రోయెన్ హ్యాచ్‌బ్యాక్ నుంచి ఎస్‌యూవీ వరకు అనేక వాహనాలను పరిచయం చేసింది. వీటిలో సిట్రోయెన్ ఈ-సీ3 ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కూడా ఉంది, ఇది బడ్జెట్ ఈవీ విభాగంలో కంపెనీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ మోడల్‌కు చెందిన న్యూ జనరేషన్ టెస్టింగ్ యూనిట్ భారతదేశంలో కనిపించింది. దీంతో కంపెనీ త్వరలోనే దీని అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేయవచ్చనే అంచనాలు పెరుగుతున్నాయి.
కొత్త జనరేషన్ సిట్రోయెన్ ఈ-సీ3 టెస్టింగ్ యూనిట్ ఇటీవల బెంగళూరులో కనిపించింది. ఇందులో ముఖ్యంగా గమనించదగ్గ విషయం ఏమిటంటే.. ఈ కారును పూర్తిగా కవర్‌తో కప్పలేదు. కేవలం ఫ్రంట్ గ్రిల్, బ్రాండ్ లోగో మాత్రమే కప్పి ఉంచారు. మిగిలిన బాడీ స్పష్టంగా కనిపించింది. దీంతో కంపెనీ ఈ మోడల్‌కు సంబంధించిన టెస్టింగ్‌ను చాలా వేగంగా చేస్తోందని తెలుస్తోంది. ఈ కారు ఎరుపు రంగులో ఉంది. దీని డిజైన్‌లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి..అంటే కొత్త ఈ-సీ3లో ఇంటర్నల్, ఎక్సటర్నల్ గా కూడా అప్‌డేట్‌లు రాబోతున్నాయి.
సాధారణంగా యూరప్‌లో అమ్ముడయ్యే సీ3 ట్విన్స్ ఎక్స్‌టీరియర్ డిజైన్, భారతదేశంలో లభించే సీ3 ట్విన్స్ కంటే ఎక్కువ ప్రీమియంగా ఉంటుంది. వీటి ముందు, వెనుక భాగాలు మరింత స్ట్రెయిట్‌గా, టెక్నికల్‌గా బలంగా ఉంటాయి. షార్ప్ లైన్లు, సైడ్స్‌లో డీప్ స్కల్ప్టింగ్ కారణంగా ఈ కారు రోడ్డుపై మరింత స్ట్రాంగ్ లుక్ సంతరించుకుంటుంది.
ఈ కారులో మూడు-వరుసల గ్రిల్ లేఅవుట్, ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, దృఢమైన బంపర్, పెద్ద 17-అంగుళాల చక్రాలు, చతురస్రాకారపు ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్‌లు, పెద్ద రేర్ స్పాయిలర్ వంటివి యూరోపియన్ కార్లలో కనిపించే ప్రధాన తేడాలు. ఈ కొత్త కారు ప్రీమియం ఫీచర్లతో రానుంది. లోపల డాష్‌బోర్డ్, స్టీరింగ్ వీల్, సెంటర్ కన్సోల్, డోర్ కార్డ్‌లు, సీట్లు, ఏసీ వెంట్‌ల డిజైన్ మరింత బలంగా ఉంది. ఫీచర్లలో హెడ్-అప్ డిస్‌ప్లే, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, రెండు యూఎస్‌బీ టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌లు లభించే అవకాశం ఉంది.
యూకేలో ఈ కారును 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ డైరెక్ట్ ఇంజెక్షన్ త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో అందిస్తున్నారు. ఇది 99 హార్స్‌పవర్, 205 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ జతచేయబడింది. ఇదే పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉన్న మైల్డ్-హైబ్రిడ్ ఆప్షన్ కూడా ఉంది, ఇది 6-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.
సిట్రోయెన్ ఈ-సీ3 స్టాండర్డ్ రేంజ్, లాంగ్ రేంజ్ వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో 30 kWh, 44 kWh LFP బ్యాటరీ ప్యాక్‌లు అమర్చబడి ఉంటాయి. రెండు వేరియంట్‌లలో 111 హార్స్‌పవర్, 124.5 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే ఒకే ఇంజిన్ ఉంటుంది. సింగిల్ ఛార్జ్ పై ఛార్జ్‌పై 325 కిలోమీటర్ల రేంజ్ వరకు ఇస్తుంది. భారత మార్కెట్‌లో లాంచ్ అయిన తర్వాత ఈ కారు టాటా పంచ్ ఈవీతో గట్టి పోటీ పడే అవకాశం ఉంది.