MINI Cooper : 18 సెకన్లలో మాయమయ్యే రూఫ్..రెండు సీట్లు, గంటకు 240కిమీ..హే మిని అనగానే వచ్చేసే కారు.
MINI Cooper : ప్రముఖ కార్ల తయారీ సంస్థ మినీ భారత మార్కెట్లో తమ కొత్త తరం కూపర్ కన్వర్టిబుల్ S మోడల్‌ను విడుదల చేసింది. ఈ స్టైలిష్ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.58.50 లక్షలుగా నిర్ణయించారు. ఈ మోడల్ పూర్తిగా నిర్మించిన యూనిట్‌గా భారతదేశానికి దిగుమతి అవుతోంది. ఆసక్తిగల కస్టమర్‌ల కోసం ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న మినీ షోరూమ్‌లలో దీని బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. డెలివరీ కూడా వెంటనే మొదలవుతుంది. ఈ కొత్త తరం కారు క్లాసిక్ మినీ డిజైన్‌ను కొనసాగిస్తూనే, అనేక మోడ్రన్ టెక్నాలజీ, మెరుగైన ఫీచర్లతో వచ్చింది.
కొత్త కన్వర్టిబుల్ S డిజైన్‌లో సాంప్రదాయ మినీ రూపాన్ని నిలుపుకుంటూనే, కొన్ని కీలకమైన హైటెక్ మార్పులు చేశారు. ముందు భాగంలో గుండ్రటి LED హెడ్‌ల్యాంప్స్ ఉన్నాయి, వీటిలో మూడు రకాల DRL (డే-టైమ్ రన్నింగ్ లైట్స్) సిగ్నేచర్‌లు, కొత్త గ్రిల్ అమర్చారు. ఈ మోడల్ ప్రత్యేక ఆకర్షణ ఏమిటంటే, కారు వద్దకు వచ్చినప్పుడు, వెళ్లిపోయినప్పుడు లోగో ప్రొజెక్షన్‌తో కూడిన వెల్‌కమ్, గుడ్‌బై యానిమేషన్స్ కనిపిస్తాయి. సైడ్ ప్రొఫైల్‌లో కొత్త 18-అంగుళాల స్లైడ్ స్పోక్, ఫ్లాష్ స్పోక్ 2-టోన్ అల్లాయ్ వీల్స్ అమర్చారు. వెనుకవైపు, నిలువుగా ఉండే LED టెయిల్-ల్యాంప్‌లు, మోడల్ పేరు రాసిన నలుపు రంగు స్ట్రిప్ డిజైన్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి. ఈ కారు బ్రిటిష్ రేసింగ్ గ్రీన్, చిల్లీ రెడ్, సన్నీ సైడ్ ఎల్లో, ఓషన్ వేవ్ గ్రీన్ అనే నాలుగు రంగుల్లో లభిస్తుంది.
కన్వర్టిబుల్ కారులో ప్రధాన ఆకర్షణగా నిలిచే దీని నలుపు రంగు ఫ్యాబ్రిక్ రూఫ్, కేవలం 18 సెకన్లలో పూర్తిగా తెరచుకుంటుంది. ఈ రూఫ్‌ను గంటకు 30 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు కూడా తెరవడం లేదా మూయడం చేయవచ్చు. మూసివేయడానికి 15 సెకన్లు పడుతుంది. అవసరమైతే ఈ రూఫ్‌ను సన్‌రూఫ్ మాదిరిగా కూడా సగం తెరుచుకునేలా వాడుకోవచ్చు. ఇంటీరియర్‌లో క్లాసిక్ థీమ్ కొనసాగించినప్పటికీ అతిపెద్ద ఆకర్షణగా రౌండ్ OLED టచ్‌స్క్రీన్ నిలిచింది. ఇది ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సెంట్రల్ డిస్‌ప్లే రెండింటిలా పనిచేస్తుంది. ఈ స్క్రీన్ MINI Operating System 9 పై పనిచేస్తుంది. యాప్ లాంటి ఇంటర్‌ఫేస్, హే మినీ (Hey MINI) వాయిస్ కంట్రోల్ ఫీచర్ ఇందులో ఉన్నాయి. బూట్ స్పేస్ రూఫ్ మూసి ఉన్నప్పుడు 215 లీటర్లు, తెరిచి ఉన్నప్పుడు 160 లీటర్లుగా ఉంటుంది.
మినీ కూపర్ కన్వర్టిబుల్ S పెర్ఫార్మెన్స్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఇందులో 2.0-లీటర్, 4-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 201 bhp పవర్, 300 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. పటిష్టమైన పెర్ఫార్మెన్స్ కారణంగా, ఈ కారు కేవలం 6.9 సెకన్లలో 0-100 కి.మీ/గం వేగాన్ని అందుకోగలదు, దీని టాప్ స్పీడ్ 240 కి.మీ/గం గా ఉంది. సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, DSC, ABS, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, రియర్-వ్యూ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ వంటి స్టాండర్డ్ ఫీచర్లు ఉన్నాయి. క్రూయిజ్ కంట్రోల్, పార్కింగ్ అసిస్ట్, కీ లేకుండానే కారులోకి ఎంట్రీ కంఫర్ట్ యాక్సెస్ వంటి డ్రైవర్ అసిస్ట్ ఫీచర్లు కూడా ఇందులో లభిస్తాయి.