New Income Tax Act : ట్యాక్స్ పేయర్లకు పండగే.. కొత్త ఏప్రిల్ నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం.

Update: 2025-12-29 05:19 GMT

New Income Tax Act : భారత ప్రభుత్వం తన పన్నుల వ్యవస్థలో చారిత్రాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. 2025లో తీసుకువచ్చిన ఈ సంస్కరణలు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రధానంగా ఆదాయపు పన్ను, జీఎస్టీ నిబంధనలను సామాన్యులకు అర్థమయ్యేలా, మరింత సరళంగా మార్చడమే ఈ కొత్త చట్టాల ముఖ్య ఉద్దేశం. దాదాపు 60 ఏళ్ల నాటి పాత ఆదాయపు పన్ను చట్టం స్థానంలో సరికొత్త ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్, 2025 రాబోతోంది. దీనికి సంబంధించి కీలక మార్పులెంటో తెలుసుకుందాం.

మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని భారీగా పెంచింది. కొత్త పన్ను విధానం ఎంచుకునే వారికి ఏడాదికి రూ.12 లక్షల వరకు వచ్చే ఆదాయంపై ఎలాంటి పన్ను ఉండదు. దీనివల్ల ఉద్యోగుల చేతిలో ఎక్కువ నగదు మిగిలి, మార్కెట్లో వినియోగం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త పన్ను రేట్లు ఈ విధంగా ఉన్నాయి..రూ. 4-8 లక్షల వరకు 5%, రూ 8-12 లక్షల వరకు 10%, రూ.12-16 లక్షల వరకు 15% గా నిర్ణయించారు. అత్యధికంగా రూ.24 లక్షలు దాటిన ఆదాయంపై 30% పన్ను వర్తిస్తుంది.

వ్యాపారులు, సామాన్యులను ఇబ్బంది పెడుతున్న జీఎస్టీ స్లాబులను ప్రభుత్వం కుదించింది. గతంలో ఉన్న 5%, 12%, 18%, 28% స్లాబుల స్థానంలో ఇప్పుడు ప్రధానంగా 5%, 18% అనే రెండు స్లాబులు మాత్రమే ఉండబోతున్నాయి. దాదాపు 375 రకాల వస్తువులు, సేవలపై పన్నులు తగ్గించడం వల్ల నిత్యావసరాలు చౌకయ్యే అవకాశం ఉంది. అయితే మద్యం, పొగాకు వంటి హానికర వస్తువులపై మాత్రం 40% వరకు అధిక పన్ను కొనసాగుతుంది. పన్నుల కోత వల్ల నవంబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ.1.70 లక్షల కోట్లకు తగ్గినప్పటికీ, ఇది దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు.

ఆదాయపు పన్ను, జీఎస్టీ తర్వాత ప్రభుత్వం ఇప్పుడు కస్టమ్స్ డ్యూటీని సరళతరం చేయడంపై దృష్టి సారించింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై పన్నులను తగ్గించడం ద్వారా దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. వచ్చే బడ్జెట్‌లో కస్టమ్స్ టారిఫ్ స్లాబులను 8కి తగ్గించే ప్రతిపాదన ఉంది. దీనివల్ల వ్యాపార ప్రక్రియలు వేగవంతం కావడమే కాకుండా, విదేశీ పెట్టుబడిదారులకు భారత మార్కెట్‌పై నమ్మకం పెరుగుతుందని డెలాయిట్ వంటి దిగ్గజ సంస్థల నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఏప్రిల్ 1 నుంచి అమలు కాబోయే కొత్త ఆదాయపు పన్ను చట్టంతో పాటు మరికొన్ని ప్రత్యేక చట్టాలను కూడా ప్రభుత్వం తీసుకువస్తోంది. సిగరెట్లపై అదనపు ఎక్సైజ్ డ్యూటీ, పాన్ మసాలాపై జీఎస్టీ సెస్‌కు సంబంధించి కొత్త నిబంధనలు రాబోతున్నాయి. పన్నుల వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్ చేయడం, ఫేస్‌లెస్ సిస్టమ్‌ను బలోపేతం చేయడం ద్వారా పారదర్శకతను పెంచడమే ప్రభుత్వ తదుపరి ఎజెండా. పాత వివాదాల పరిష్కారం కోసం ప్రత్యేకంగా క్షమాభిక్ష పథకాన్ని ప్రవేశపెట్టాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది.

Tags:    

Similar News