Kia Seltos 2026 : క్రెటాకు షాక్.. అదిరిపోయే ఫీచర్లతో కియా సెల్టోస్ ఎంట్రీ.

Update: 2025-11-21 09:00 GMT

Kia Seltos 2026 : భారత మార్కెట్‌లో కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా మధ్య పోటీ మామూలుగా ఉండదు. ఈ పోటీని మరింత పెంచడానికి కియా సంస్థ కొత్త తరం సెల్టోస్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. కొత్త డిజైన్, అద్భుతమైన ఫీచర్లతో 2026లో ఈ ఎస్‌యూవీ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త సెల్టోస్‌లో క్రెటాలో లేని ఐదు అదిరిపోయే ఫీచర్లు ఉండవచ్చని మీడియా రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఆ ప్రత్యేక ఫీచర్లు, వివరాలు ఏంటో చూద్దాం.

1. ఫుల్లీ ఆటోమేటిక్ పార్క్ అసిస్ట్

కొత్త తరం సెల్టోస్‌లో దాదాపు 6-7 పార్కింగ్ సెన్సార్‌లను చూశారు. ఇది ఆటో పార్క్ ఫీచర్ వైపు సిగ్నల్ ఇస్తోంది. ఇది పూర్తిగా ఆటోమేటిక్ పార్క్ సెటప్ అయి ఉండవచ్చు లేదా కనీసం ఆటో పారలల్ పార్క్ వంటి ఫీచర్లు అయినా ఉండవచ్చు. ఈ ఫీచర్ డ్రైవర్‌కు పార్కింగ్ సమయంలో చాలా సౌలభ్యాన్ని ఇస్తుంది.

2. వెంటిలేటెడ్ రియర్ సీట్లు

సెల్టోస్‌లో మరో ప్రత్యేక ఫీచర్ ఏమిటంటే.. వెనుక సీట్లకు (రియర్ సీట్స్) వెంటిలేటెడ్ ఫంక్షన్ రావడం. కియా సైరోస్‌లో ఇప్పటికే ఈ ఫీచర్ ఉంది. అయితే సెల్టోస్‌లో కేవలం సీట్ బేస్ వద్ద కాకుండా, సీటు మొత్తం (పై, కింద భాగాలలో) కూలింగ్ వెంటిలేషన్ ఫీచర్ ఇవ్వాలని కియా ప్లాన్ చేస్తోంది. ఇది వెనుక కూర్చునే ప్రయాణికులకు సుదీర్ఘ ప్రయాణాలలో మంచి అనుభూతిని ఇస్తుంది.

3. ట్రినిటీ డిస్‌ప్లే

కియా సైరోస్ నుంచి సెల్టోస్‌లోకి రాబోతున్న మరో ఫీచర్ ట్రినిటీ డిస్‌ప్లే. ఈ కొత్త స్క్రీన్ సెటప్‌లో మూడు భాగాలు ఉంటాయి. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 5-అంగుళాల క్లైమేట్ కంట్రోల్ స్క్రీన్, ఇది కారు ఇంటీరియర్‌కు మరింత టెక్నాలజీ లుక్‌ను తీసుకువస్తుంది.

4. స్లైడింగ్ రియర్ సీట్ల ఆప్షన్

మెరుగైన సౌకర్యం కోసం, కొత్త తరం కియా సెల్టోస్‌లో రిక్లైనింగ్ తో పాటు స్లైడింగ్ రియర్ సీట్ ఆప్షన్ కూడా ఉండనుంది. చాలా కార్లలో రిక్లైనింగ్ ఫీచర్ ఉన్నప్పటికీ, స్లైడింగ్ ఫీచర్ అదనంగా లెగ్‌రూమ్‌ను పెంచడానికి లేదా తగ్గించడానికి వీలు కల్పిస్తుంది. ఇది లగేజ్ స్పేస్‌కు లేదా ప్రయాణికులకు సౌకర్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది.

5. హైబ్రిడ్ ఇంజిన్

ఇది ఫీచర్ కానప్పటికీ సెల్టోస్‌కు అతిపెద్ద అప్‌గ్రేడ్‌లలో ఒకటి కొత్త 1.6-లీటర్ హైబ్రిడ్ ఇంజిన్ వచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా అమ్ముడవుతున్న పాత హ్యుందాయ్ కోనా హైబ్రిడ్ ఇంజిన్‌ను సెల్టోస్‌లో ఉపయోగించవచ్చని అంచనా. ఈ కొత్త మోడల్ మైలేజ్ దాదాపు లీటరుకు 25 కిమీ వరకు ఉండవచ్చు. ఇది ఇంధన సామర్థ్యం విషయంలో సెల్టోస్‌ను మార్కెట్‌లో బెస్ట్ ఎస్‌యూవీగా నిలపనుంది.

ధర అంచనాలు

కొత్త తరం కియా సెల్టోస్ 2026 మొదటి భాగంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ధర విషయానికి వస్తే ప్రస్తుత మోడల్ కంటే దీని ధర కొంచెం పెరిగే అవకాశం ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.13 లక్షల నుంచి రూ.28 లక్షల వరకు ఉండవచ్చు.

Tags:    

Similar News