New Kia Seltos Hybrid : రోడ్లపై కియా సెల్టోస్ విశ్వరూపం..హైబ్రిడ్ ఇంజిన్‌తో పెట్రోల్ బంకులకు చెక్.
New Kia Seltos Hybrid : దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా, భారత మార్కెట్లో తన పట్టును మరింత బిగించేందుకు సిద్ధమైంది. తన బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ సెల్టోస్‌ను సరికొత్త హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్, అత్యాధునిక ట్రిపుల్ స్క్రీన్ సెటప్‌తో తిరిగి తీసుకువస్తోంది. 2025 ఇన్వెస్టర్ డే సందర్భంగా కియా ఈ విషయాన్ని ధృవీకరించింది. పెట్రోల్ ధరల సెగ తగులుతున్న ఈ కాలంలో, అదిరిపోయే మైలేజీతో రానున్న ఈ కారు కోసం వాహన ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది (2026) చివరిలో లేదా 2027 ఆరంభంలో భారత మార్కెట్లోకి రానున్న ఈ కొత్త కియా సెల్టోస్ హైబ్రిడ్, 1.5 లీటర్ ఫోర్-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్తో రానుంది. దీనికి తోడు ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ ప్యాక్ జతచేయబడతాయి. దీనివల్ల నగరాల్లో ప్రయాణించేటప్పుడు అద్భుతమైన మైలేజీని ఇస్తుంది. కియా తన హైబ్రిడ్ సిస్టమ్ కోసం విడిభాగాలను భారతదేశంలోనే తయారు చేయాలని భావిస్తోంది, తద్వారా ధరను సామాన్యులకు అందుబాటులో ఉంచవచ్చు.
కొత్త సెల్టోస్ ఇంటీరియర్ ఇప్పుడు మునుపటి కంటే చాలా లగ్జరీగా ఉండబోతోంది. ఇందులో ట్రిపుల్ స్క్రీన్ సెటప్ ప్రధాన ఆకర్షణ. రెండు 12.3 ఇంచ్ స్క్రీన్లు (ఒకటి ఇన్ఫోటైన్మెంట్ కోసం, మరొకటి డిజిటల్ క్లస్టర్ కోసం). ఒక 5-ఇంచ్ డెడికేటెడ్ స్క్రీన్ (క్లైమేట్ కంట్రోల్, ఇతర ఫంక్షన్ల కోసం). దీనివల్ల కారు లోపల డ్యాష్‌బోర్డ్ మొత్తం ఒక డిజిటల్ ప్యానెల్ లాగా కనిపిస్తుంది. ఇది కాకుండా పనోరమిక్ సన్‌రూఫ్, లెవల్ 2 ADAS సేఫ్టీ ఫీచర్లు, వెంటిలేటెడ్ సీట్లు, బోస్ సౌండ్ సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
కియా కేవలం సెల్టోస్‌తోనే ఆగడం లేదు. కియా సోరెంటో ప్లాట్‌ఫారమ్ ఆధారంగా ఒక 7-సీటర్ ప్రీమియం హైబ్రిడ్ ఎస్‌యూవీని కూడా 2026 చివరి నాటికి లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ప్లాంట్‌లోనే తయారవుతుంది. ఈ కారు నేరుగా మహీంద్రా XUV 7XO, టాటా సఫారీ, హ్యుందాయ్ అల్కాజర్ వంటి దిగ్గజాలతో తలపడనుంది. సోరెంటో ఆధారిత ఈ కారు 4810 మిమీ పొడవుతో రోడ్డుపై గంభీరంగా కనిపిస్తుంది.
కియా సెల్టోస్ హైబ్రిడ్ రాకతో మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో పోటీ మరింత పెరగనుంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న మారుతి గ్రాండ్ విటారా, టొయొటా హైరైడర్ వంటి స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లకు ఇది ప్రధాన ప్రత్యర్థిగా మారనుంది. అలాగే హ్యుందాయ్ నుంచి రాబోయే క్రెటా హైబ్రిడ్ కూడా దీనికి సవాల్ విసిరే అవకాశం ఉంది. అయితే కియా ఇచ్చే వినూత్నమైన డిజైన్, అధునాతన టెక్నాలజీ (ట్రిపుల్ స్క్రీన్) వల్ల వినియోగదారులు సెల్టోస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.