New Kia Syros : 5-స్టార్ సేఫ్టీతో కియా సైరోస్ రచ్చ..మస్త్ ఫీచర్లు, తక్కువ ధర..ఇక కస్టమర్ల క్యూ గ్యారెంటీ.
New Kia Syros : కియా ఇండియా తన సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ సైరోస్ లైనప్‌ను మరింత బలోపేతం చేస్తూ, సరికొత్త HTK (EX) వేరియంట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. రూ.10 లక్షల లోపు బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లు, ముఖ్యంగా సన్‌రూఫ్ కోరుకునే కస్టమర్ల కోసం ఈ వేరియంట్‌ను కియా ప్రత్యేకంగా డిజైన్ చేసింది. పెట్రోల్, డీజిల్..రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభించే ఈ కారు తన సెగ్మెంట్‌లోని ఇతర దిగ్గజ కార్లకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది.
కియా సైరోస్ HTK (EX) వేరియంట్‌ను కేవలం బడ్జెట్ కారుగా మాత్రమే కాకుండా, ఫీచర్ల పరంగా కూడా తోపుగా తీర్చిదిద్దారు. రూ.9.89 లక్షల (పెట్రోల్) ప్రారంభ ధరలోనే మీకు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ లభించడం ఈ కారు అతిపెద్ద ప్లస్ పాయింట్. ఎక్స్‌టీరియర్ పరంగా చూస్తే.. ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, ఎల్‌ఈడీ డీఆర్ఎల్స్ (DRLs), ఆకర్షణీయమైన ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు ఉన్నాయి. అంతేకాదు ప్రీమియం లుక్ కోసం 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ (పెట్రోల్ వెర్షన్‌లో డ్యూయల్ టోన్) కూడా ఇచ్చారు.
కారు లోపలికి వెళ్తే సెగ్మెంట్‌లోనే పెద్దదైన 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మిమ్మల్ని స్వాగతిస్తుంది. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేను సపోర్ట్ చేస్తుంది. సేఫ్టీ విషయంలో కియా ఎక్కడా రాజీ పడలేదు. భారత్ NCAPలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకున్న ఈ ఎస్‌యూవీలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి 20కి పైగా భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
సైరోస్ HTK (EX) వేరియంట్ రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఒకటి 1.0 లీటర్ టర్బో పెట్రోల్. ఇది 120 BHP పవర్, 172 NM టార్క్‌ను అందిస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ప్రామాణికంగా వస్తుంది. రెండోది 1.5 లీటర్ డీజిల్. ఇది 116 BHP పవర్, 250 NM టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కియా సైరోస్ HTK (EX) పెట్రోల్ వేరియంట్ ధర రూ.9,89,000 కాగా, డీజిల్ వెర్షన్ ధర రూ.10,63,900 (ఎక్స్-షోరూమ్). ఈ ధర వద్ద ఇది టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి బ్రెజ్జా, స్కోడా కైలాక్ వంటి కార్లకు సింహస్వప్నంలా మారనుంది. సన్‌రూఫ్, బిగ్ స్క్రీన్, 5-స్టార్ సేఫ్టీ.. ఈ మూడింటి కలయికతో కియా తన మార్కెట్ వాటాను పెంచుకోవాలని చూస్తోంది.