Maruti Victoris : మారుతి విక్టోరిస్ ఎస్‌యూవీకి భారీ డిమాండ్.. లాంచ్ అయిన నెలలోనే 4,261 యూనిట్లు సేల్.
Maruti Victoris : మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో సంచలనం సృష్టిస్తూ సరికొత్త మారుతి సుజుకి విక్టోరిస్ భారత మార్కెట్లో అడుగుపెట్టింది. సెప్టెంబర్ 15, 2025 నుండి దీని అమ్మకాలు ప్రారంభం కాగా కేవలం ఆ నెలలోని మిగిలిన 15 రోజుల్లోనే కంపెనీ తన డీలర్లకు 4,261 యూనిట్లను పంపింది. మారుతి విక్టోరిస్ మొత్తం 6 ట్రిమ్ లెవెల్స్, 21 వేరియంట్‌లలో లభిస్తుంది. దీని ధర రూ.10.5 లక్షల నుండి రూ.19.99 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. మారుతి విక్టోరిస్ ధరలు రూ.10.5 లక్షల నుండి ప్రారంభమై రూ.19.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. కొనుగోలుదారులు రూ.27,707 నుండి ప్రారంభమయ్యే నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ద్వారా కూడా విక్టోరిస్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ ప్లాన్‌లో వాహన ఖర్చు, మెయింటెనెన్స్, బీమా, రిజిస్ట్రేషన్, రోడ్ సైడ్ అసిస్టెన్స్ అన్నీ కలిపి ఉంటాయి. ఇది కారు కొనుగోలును మరింత సులభతరం చేస్తుంది.
మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి విక్టోరిస్, ఇప్పటికే ఉన్న ప్రముఖ మోడల్స్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది. దీని ప్రధాన పోటీదారులు హ్యుందాయ్ క్రెటా, టయోటా హైరైడర్, కియా సెల్టోస్, హోండా ఎలివేట్, స్కోడా కుషాక్, వోక్స్‌వ్యాగన్ టైగూన్. ఈ విభాగంలో విక్టోరిస్ ఎలా రాణిస్తుందో చూడాలి.
మారుతి సుజుకి విక్టోరిస్‌లో మారుతి గ్రాండ్ విటారాలో ఉన్న పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది మూడు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. 103hp 1.5-లీటర్ మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్, 116hp 1.5-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్, 89hp 1.5-లీటర్ పెట్రోల్-సీఎన్‌జీ ఇంజిన్. ఈ కారులో ఒక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఇందులో అండర్‌బాడీ ట్యాంక్ అమర్చబడింది. ఇది బూట్ స్పేస్‌ను తగ్గించకుండా ఎక్కువ లగేజ్ పెట్టుకునే సౌలభ్యాన్ని అందిస్తుంది.
ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్‌లో 5-స్పీడ్ మ్యాన్యువల్, ఈ-సీవీటీ, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ఉన్నాయి. విక్టోరిస్ టాప్-ఎండ్ పెట్రోల్ మైల్డ్-హైబ్రిడ్ ఆటోమేటిక్ వేరియంట్లు మాత్రమే ఏడబ్ల్యూడీ సిస్టమ్‌తో అందుబాటులో ఉన్నాయి. ఇది కఠినమైన రోడ్లపై కూడా మెరుగైన పట్టును అందిస్తుంది. మారుతి విక్టోరిస్ అద్భుతమైన మైలేజ్‌ను అందిస్తుంది. పెట్రోల్ మ్యాన్యువల్ లీటరుకు 21.18 కి.మీ, పెట్రోల్ ఆటోమేటిక్ లీటరుకు 21.06 కి.మీ, పెట్రోల్ ఆటోమేటిక్ ఏడబ్ల్యూడీ లీటరు 19.07 కి.మీ, సీఎన్‌జీ కిలోకు 27.02 కి.మీ, స్ట్రాంగ్ హైబ్రిడ్ లీటరుకు 28.56 కి.మీ మైలేజీ ఇస్తుంది. సేఫ్టీ కోసం ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్‌తో ఈబీడీ, 360-డిగ్రీ కెమెరా, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, లెవెల్ 2 ఏడిఏఎస్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉన్నాయి. అంతే కాకుండా 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వంటివి ఉన్నాయి.