NITI Aayog : ఇక సామాన్యుడి సొంతింటి కల నిజమే.. నీతి ఆయోగ్ సంచలన ప్లాన్.

Update: 2026-01-08 07:30 GMT

NITI Aayog : సొంతిల్లు అనేది ప్రతి సామాన్యుడి కల. ఆ కలని నిజం చేసేందుకు నీతి ఆయోగ్ ఒక భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. దేశంలో పెరుగుతున్న పట్టణ జనాభాను దృష్టిలో ఉంచుకుని, అందరికీ అందుబాటు ధరలో ఇళ్లు అందించడమే లక్ష్యంగా కీలక ప్రతిపాదనలు చేసింది. గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కలిసి రూపొందించిన ఈ నివేదికలో బిల్డర్లకు, కొనుగోలుదారులకు భారీ ఊరటనిచ్చే అంశాలు ఉన్నాయి. దేశంలో పట్టణీకరణ వేగంగా పెరుగుతోంది. నీతి ఆయోగ్ అంచనా ప్రకారం.. 2021లో 35 శాతంగా ఉన్న పట్టణ జనాభా, 2050 నాటికి 50 శాతానికి (సుమారు 85 కోట్ల మంది) చేరుకుంటుంది. ఇంత భారీ జనాభాకు ఇళ్లు అందించాలంటే ప్రస్తుతమున్న గృహనిర్మాణ వేగం సరిపోదు. అందుకే తక్కువ ధరలో ఎక్కువ ఇళ్లను నిర్మించేలా డెవలపర్లను ప్రోత్సహించడానికి 100 శాతం పన్ను మినహాయింపును మళ్లీ తీసుకురావాలని నీతి ఆయోగ్ ప్రతిపాదించింది. గతంలో అమల్లో ఉన్న ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80-IBAని తిరిగి ప్రవేశపెడితే ప్రైవేట్ కంపెనీలు భారీగా ఈ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడతాయని నివేదిక పేర్కొంది.

భారతదేశంలో స్థలం ధరలు ఎక్కువగా ఉండటమే కాకుండా, నిధుల కొరత, హోమ్ లోన్ వ్యవస్థలో ఉన్న లోపాల వల్ల సరసమైన ఇళ్లు నిర్మించడం బిల్డర్లకు పెద్దగా లాభదాయకంగా ఉండటం లేదు. అందుకే నీతి ఆయోగ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ వంటి సంస్థల ద్వారా తక్కువ వడ్డీకి నిధులు సేకరించేలా, పెట్టుబడిదారులకు అద్దె ఆదాయం, లాభాలపై పన్ను రాయితీలు ఇవ్వాలని సూచించింది. దీనివల్ల ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం తగ్గి, సామాన్యులకు తక్కువ ధరకే ఇళ్లు అందుతాయి.

తక్కువ ఆదాయ వర్గాల కోసం క్రెడిట్ రిస్క్ గ్యారెంటీ ఫండ్ స్కీమ్ కింద ఇచ్చే లోన్ పరిమితిని ప్రస్తుతం ఉన్నదానికంటే పెంచి 40 లక్షల రూపాయలు చేయాలని ఆయోగ్ సూచించింది. దీనివల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు లోన్లు దొరకడం సులభతరమవుతుంది. అలాగే నేషనల్ హౌసింగ్ బ్యాంక్ పన్ను రహిత బాండ్లను జారీ చేసేలా అనుమతులు ఇవ్వాలని, ఆ నిధులను ఆర్థికంగా వెనుకబడిన వర్గాల గృహ నిర్మాణ ప్రాజెక్టులకు మళ్లించాలని ప్రతిపాదించింది. దీనివల్ల రుణాలపై వడ్డీ భారం తగ్గుతుంది.

సామాన్యులకు భారంగా మారే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి మినహాయింపు ఇవ్వాలని నీతి ఆయోగ్ మరో కీలక ప్రతిపాదన చేసింది. ముఖ్యంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన - అర్బన్ 2.0 కింద నిర్మించే ఇళ్లకు ఈ రాయితీలు వర్తింపజేయాలని కోరింది. అలాగే, కేవలం తక్కువ ధర ఇళ్ల కోసమే భూమిని కేటాయించినప్పుడు, భూ వినియోగ మార్పిడి చార్జీలను కూడా రద్దు చేయాలని సూచించింది. నిర్దేశించిన ఫ్లోర్ ఏరియా రేషియోలో కనీసం 50 శాతం ఇళ్లకే వాడితే ఈ రాయితీలు బిల్డర్లకు అందుతాయి.

Tags:    

Similar News