Nitin Gadkari : ఇక పెట్రోల్ కార్ల ధరకే ఈవీలు.. నితిన్ గడ్కరీ సంచలన ప్రకటన.

Update: 2025-10-07 09:36 GMT

Nitin Gadkari : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు రాబోయే 4 నుంచి 6 నెలల్లో పెట్రోల్ కార్ల ధరలతో సమానం అయ్యే అవకాశం ఉందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం ఒక కీలక ప్రకటన చేశారు. శిలాజ ఇంధనాలపై భారతదేశం ఆధారపడటం వల్ల ఏటా రూ.22 లక్షల కోట్ల భారం పడుతుందని, ఇది ఆర్థికంగా, పర్యావరణానికి కూడా ముప్పుగా మారిందని మంత్రి అన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే, క్లీన్ ఎనర్జీని తప్పకుండా స్వీకరించాలని ఆయన స్పష్టం చేశారు.

20వ FICCI హయ్యర్ ఎడ్యుకేషన్ సమ్మిట్ 2025 లో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. "రాబోయే 4 నుంచి 6 నెలల్లోపు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ధర పెట్రోల్ వాహనాల ధరతో సమానం అవుతుంది" అని అన్నారు. అంతేకాకుండా, రాబోయే ఐదేళ్లలో భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీని ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానానికి చేర్చడమే తమ లక్ష్యమని ఆయన ప్రకటించారు.

భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆటోమొబైల్ ఇండస్ట్రీగా ఉంది. "నేను రవాణా మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు, భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ విలువ రూ.14 లక్షల కోట్లు ఉండేది. ఇప్పుడు ఇది రూ.22 లక్షల కోట్లకు పెరిగింది" అని గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం అమెరికా ఆటోమొబైల్ ఇండస్ట్రీ విలువ రూ.78 లక్షల కోట్లు, దాని తర్వాత చైనా (రూ.47 లక్షల కోట్లు) ఉంది. ఆ తర్వాతే భారతదేశం (రూ.22 లక్షల కోట్లు) స్థానం ఉంది.

ఇంధన భారాన్ని తగ్గించడంతో పాటు, వ్యవసాయ రంగం ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలను కూడా గడ్కరీ ప్రస్తావించారు. రైతులు మొక్కజొన్న నుంచి ఇథనాల్ తయారు చేయడం ద్వారా రూ.45,000 కోట్ల అదనపు ఆదాయాన్ని పొందారని ఆయన తెలిపారు. అలాగే, 2027 నాటికి దేశంలో వేరు చేసిన ఘన వ్యర్థాలను పూర్తిగా రోడ్ల నిర్మాణంలో ఉపయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీని ద్వారా వ్యర్థాల నుంచి కూడా విలువను సృష్టించవచ్చని మంత్రి అన్నారు.

Tags:    

Similar News