పేటీఎం బ్రాండ్‌తో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫిన్‌టెక్ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో కంపెనీ రూ.928.3 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో రూ.290.5 కోట్ల నష్టాల్ని నమోదు చేసిన కంపెనీ తాజాగా లాభాల బాట పట్టింది. కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 34.1శాతం క్షీణించి రూ.1,659.5 కోట్లకు చేరింది. పేటీఎం సినిమాలు, ఈవెంట్ల టిక్కెట్ల బుకింగ్ విభాగాన్ని జొమాటోకు విక్రయించడంతో రూ.1,345 కోట్లు లాభం పొందినట్లు కంపెనీ స్వయంగా వెల్లడించింది. దీంతో కంపెనీ తిరిగి లాభాల్ని నమోదు చేసుకుంది. ఆర్థిక సేవల విభాగం నుంచి వచ్చే ఆదాయం 9శాతం పెరిగి రూ.376 కోట్లకు చేరిందని, పేటీఎం వ్యాపారం సేవల నుంచి వచ్చే ఆదాయం ఏకంగా 34శాతం పెరిగి రూ.981 కోట్లుగా నమోదైందని వెల్లడించింది. కంపెనీ ఖర్చులు 17శాతం తగ్గి రూ.1,080 కోట్లకు చేరాయని తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో పేటీఎం షేరు బీఎస్‌ఈలో 4.73 నష్టంతో రూ.692.15 వద్ద ముగిసింది.