Personal Loan : పర్సనల్ లోన్ కావాలా? బ్యాంకులు చెక్ చేసే ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి.

Update: 2025-10-13 05:30 GMT

Personal Loan : అనుకోని ఖర్చులు వచ్చినా, అవసరాలు తీర్చుకోవాలన్నా చాలా మంది వెంటనే పర్సనల్ లోన్ తీసుకుంటారు. అయితే, సరైన అవగాహన లేకుండా లోన్ కోసం అప్లై చేస్తే, అది రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. లోన్ తిరస్కరణకు గురైతే, మీ పనులు ఆగిపోవడమే కాక, మీ క్రెడిట్ స్కోర్ కూడా దెబ్బతింటుంది. బ్యాంకులు లేదా ఫైనాన్స్ కంపెనీలు లోన్ ఇచ్చే ముందు ముఖ్యంగా 5 విషయాలు చూస్తాయి. ఆ వివరాలు తెలుసుకుంటే మీరు మీ ఫైనాన్షియల్ ప్రొఫైల్‌ను మెరుగుపరుచుకుని, సులభంగా, మంచి వడ్డీ రేటుతో లోన్ పొందవచ్చు.

1. జీతం లేదా ఆదాయం

లోన్ ఇచ్చే బ్యాంకులు లేదా కంపెనీలు ముందుగా చూసేది, మీరు లోన్ తిరిగి కట్టగలరా లేదా అని. దీనికి కీలకం మీ ఆదాయం. మీకు నెలవారీ మంచి జీతం ఉంటే, లోన్ సులభంగా మంజూరయ్యే అవకాశం పెరుగుతుంది. ముఖ్యంగా, ఒకే కంపెనీలో కనీసం 1-2 ఏళ్లుగా పనిచేస్తుంటే దాన్ని స్థిరమైన ఉద్యోగంగా భావించి ప్రాధాన్యత ఇస్తారు. ఇక స్వయం ఉపాధి పొందుతున్న వారు తమ ఆదాయానికి సంబంధించిన ఆధారాలు, పన్ను రిటర్నులు లేదా ఆర్థిక నివేదికలు చూపించాల్సి ఉంటుంది.

2. క్రెడిట్ స్కోర్

పర్సనల్ లోన్ మంజూరులో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించేది మీ క్రెడిట్ స్కోర్. 750 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ ఉంటే దాన్ని చాలా మంచిదిగా పరిగణిస్తారు. ఈ స్కోర్.. గతంలో మీరు తీసుకున్న అప్పులను సమయానికి చెల్లించారని రుజువు చేస్తుంది. ఒకవేళ మీరు గతంలో ఈఎమ్ఐలు ఆలస్యంగా కట్టినా, డిఫాల్ట్ అయినా లేదా ఒకేసారి ఎక్కువ లోన్ అప్లికేషన్లు పెట్టినా, లోన్ మంజూరు కావడం కష్టమవుతుంది. కాబట్టి, మీ క్రెడిట్ స్కోర్‌ను తరచుగా చెక్ చేసుకుని అందులో ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోవాలి.

3. ఇప్పటికే ఉన్న అప్పులు, బాధ్యతలు

కొత్త లోన్ ఇచ్చే ముందు బ్యాంకులు మీ డెట్-టు-ఇన్‌కమ్ రేషియోను చూస్తాయి. అంటే, మీ నెలవారీ ఆదాయంలో ఎంత శాతం ఇప్పటికే ఉన్న EMIల కోసం పోతుందో లెక్కిస్తాయి. మీ ఆదాయంలో 40-50% కంటే ఎక్కువ EMIలకే పోతుంటే, కొత్త లోన్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. కాబట్టి, కొత్త లోన్ కోసం అప్లై చేసే ముందు చిన్న చిన్న అప్పులను తీర్చేయడం లేదా లోన్లను కన్సాలిడేట్ చేసుకోవడం మంచిది. ఇది మీ లోన్ అర్హతను పెంచుతుంది.

4. వయస్సు, తిరిగి చెల్లించే సామర్థ్యం

లోన్ కోసం అప్లై చేసే వ్యక్తి వయస్సు కూడా ముఖ్యమే. సాధారణంగా బ్యాంకులు 21 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారికి లోన్ ఇవ్వడానికి మొగ్గు చూపుతాయి. తక్కువ వయస్సు ఉండి, ఇంకా చాలా సంవత్సరాలు సంపాదించే కెరీర్ ఉన్నవారిని తక్కువ రిస్క్ ఉన్న కస్టమర్‌గా భావిస్తారు. అయితే, చాలా తక్కువ వయస్సు ఉండి, అసలు ఫైనాన్షియల్ ట్రాక్ రికార్డు లేకపోతే మాత్రం ఇబ్బంది అవుతుంది. లోన్ కాలపరిమితి సాధారణంగా మీ రిటైర్మెంట్ వయస్సు వరకు ఉండేలా చూసుకుంటారు.

5. ఉద్యోగం/సంస్థ నేపథ్యం

మీరు ఏ కంపెనీలో పనిచేస్తున్నారు, మీ ఉద్యోగ ప్రొఫైల్ ఏంటి అనేది కూడా లోన్ మంజూరులో కీలక పాత్ర పోషిస్తుంది. మీరు పేరున్న లేదా ఆర్థికంగా స్థిరంగా ఉన్న కంపెనీలో పనిచేస్తుంటే, మీ లోన్ అప్లికేషన్‌ను త్వరగా ఆమోదించే అవకాశం ఉంటుంది. అలాగే, డాక్టర్లు, ఇంజనీర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు వంటి వృత్తిపరమైన డిగ్రీలు ఉన్నవారు లేదా నియంత్రిత వృత్తులలో ఉన్నవారిని బ్యాంకులు మరింత నమ్మదగినవారుగా భావిస్తాయి.

Tags:    

Similar News