Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ రేట్ల బాదుడు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ రేట్లను మళ్లీ బాదేశారు. వరుసగా ఏడోరోజు ఇండియన్ మార్కెట్లో పెట్రో ధరలు పెరిగాయి.;
Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ రేట్లను మళ్లీ బాదేశారు. వరుసగా ఏడోరోజు కూడా ఇండియన్ మార్కెట్లో పెట్రో ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడం ఆలస్యం టాప్ స్పీడ్‌లో ఇక్కడ కూడా పెంచేస్తున్నారు. కరోనా సంక్షోభం నుంచి జనం ఇప్పుడిప్పుడు కోలుకుంటున్నారని తెలిసినా, ధరల పెంపులో కాస్త గ్యాప్ ఇవ్వాలని అర్థమవుతున్నా.. చమురు సంస్థలు మాత్రం కనికరం చూపడం లేదు.
ఎన్నికలప్పుడు ధరలను కంట్రోల్‌లో పెట్టే కేంద్ర ప్రభుత్వం.. మామూలు రోజుల్లో కళ్లు మూసుకుని ప్రవర్తిస్తోంది. చాలా రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ఏకంగా 110 రూపాయలు క్రాస్ చేసింది. సామాన్యులు ఈ ధరల పెంపును భరించలేని స్థితిలో ఉన్నారు. అయినప్పటికీ.. రోజుకు అర్ధరూపాయి చొప్పున రేట్లు పెంచుతూనే ఉన్నారు.
ఇవాళ కూడా లీటర్ పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసలు పెంచారు. ఈ పెంపుతో దేశంలోని అనేక నగరాల్లో లీటర్ పెట్రోల్ 110 రూపాయలను దాటింది. హైదరాబాద్‌లో పెట్రోల్ 108 రూపాయల 65 పైసలు, డీజిల్ 101 రూపాయల 52 పైసలు పలుకుతోంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 110 రూపాయలు, డీజిల్ 100 రూపాయలను దాటేసింది. పెట్రోల్ అమ్మకాలపై తమిళనాడు ప్రభుత్వం మూడు రూపాయల పన్నును తగ్గించినప్పటికీ.. వరుసగా రేట్లు పెంచడం వల్ల చెన్నైలో పెట్రోల్ ధర వంద రూపాయల మార్క్‌ను దాటింది.
అక్టోబర్ ఒకటి నుంచి ఇవాళ్టి వరకు లీటర్ పెట్రోల్‌పై 2 రూపాయల 80 పైసలు పెంచారు. డీజిల్ ఏకంగా 3 రూపాయల 30 పైసలు పెరిగింది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరగడం వల్లే పెట్రో రేట్లు పెంచుతున్నామని చమురు సంస్థలు చెబుతున్నాయి. నిజానికి ఇంటర్నేషనల్ మార్కెట్లో ధరలు స్థిరంగా ఉన్నప్పుడు కూడా ఇండియన్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రేట్లు పెంచాయి.
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు అత్యంత తక్కువగా ఉన్న సమయంలోనూ వాహనదారులకు ఊరటనివ్వలేదు. ఈ పరిస్థితుల్లో రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరగడమే తప్ప.. తగ్గే అవకాశమే లేదని చెబుతున్నారు.