Postoffice : పోస్టాఫీసు గ్యారెంటీ స్కీమ్.. నెలకు రూ.60,000 ఆదాయం పొందే అవకాశం

Update: 2025-10-04 14:15 GMT

Postoffice : పోస్టాఫీసులో అందుబాటులో ఉన్న ప్రభుత్వ పొదుపు పథకాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) చాలా మందికి విశ్వసనీయమైన పథకంగా ఉంది. ఇది దీర్ఘకాలంలో మంచి రాబడి ఇస్తుంది, ముఖ్యంగా పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. ఈ స్కీమ్‌లో క్రమం తప్పకుండా డబ్బు పెట్టుకుంటూ పోతే, మీరు కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాదు, మీ అసలు డబ్బు భద్రంగా ఉంటూనే, ప్రతి నెలా రూ.61,000 వరకు స్థిరమైన ఆదాయం కూడా పొందవచ్చు.

ప్రస్తుతం పీపీఎఫ్ పథకంపై సంవత్సరానికి 7.1% చొప్పున వడ్డీ వస్తుంది. ఇది దీర్ఘకాలం పెట్టుబడి పెట్టేవారికి చాలా మంచి రేటు. ఈ స్కీమ్‌లో పెట్టే డబ్బుపై ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద, మీరు రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. అంటే, పెట్టుబడితో పాటు పన్ను కూడా ఆదా అవుతుంది. సరైన ప్రణాళికతో (25 ఏళ్లు) పెట్టుబడి పెడితే, మీరు రూ.1.03 కోట్ల నిధిని సిద్ధం చేసుకోవచ్చు.

పీపీఎఫ్ ఖాతాను కనీసం 15 సంవత్సరాలు కొనసాగించాలి. మీరు ప్రతి సంవత్సరం గరిష్టంగా రూ.1.5 లక్షలు చొప్పున 15 ఏళ్లు జమ చేస్తే, మీ మొత్తం పెట్టుబడి రూ.22.5 లక్షలు అవుతుంది. 7.1% వడ్డీతో ఈ మొత్తం 15 ఏళ్ల తర్వాత రూ.40.68 లక్షలు అవుతుంది. ఒకవేళ మీరు ఈ మొత్తాన్ని తీసుకోకుండా, కొత్త డబ్బు జమ చేయకుండా, ఖాతాను పొడిగించుకుంటూ పోతే..15 సంవత్సరాల తర్వాత రూ.40.68 లక్షలు, 25 సంవత్సరాల తర్వాత రూ.80.77 లక్షలు అవుతాయి. అయితే, మీరు మొత్తం 25 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం రూ.1.5 లక్షలు కడుతూ పోతే మీ మొత్తం ఫండ్ ఏకంగా రూ.1.03 కోట్లకు చేరుకుంటుంది.

మీరు 25 ఏళ్లు పూర్తి చేసి రూ.1.03 కోట్ల నిధిని సిద్ధం చేసుకున్నాక, ఆ డబ్బును తీసుకోకుండా ఖాతాలోనే ఉంచాలి. దానిపై 7.1% వడ్డీ వస్తూనే ఉంటుంది. ఈ వడ్డీ రేటు ప్రకారం మీకు సంవత్సరానికి రూ.7.31 లక్షలు వడ్డీ రూపంలో వస్తుంది. అంటే, ప్రతి నెలా దాదాపు రూ.60,941 స్థిరమైన ఆదాయం వస్తుందన్నమాట. ఈ ఆదాయంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, మీరు వడ్డీ డబ్బు మాత్రమే తీసుకుంటారు, మీ అసలు మొత్తం (రూ.1.03 కోట్లు) మాత్రం సురక్షితంగా ఖాతాలో ఉంటుంది. ఈ పీపీఎఫ్ పథకాన్ని చిన్నపిల్లల నుంచి ఉద్యోగులు, వ్యాపారం చేసేవారు ఇలా ఎవరైనా మొదలు పెట్టవచ్చు.

Tags:    

Similar News