ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా సోమవారం ఆసుపత్రికి వెళ్లారు. దీంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన ఆయన.. తన ఆరోగ్యంపై స్పష్టతనిచ్చారు. తాను బాగానే ఉన్నానని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని పేర్కొన్నారు. ఐసీయూలో చేరినట్లు వస్తున్న వార్తలను ఖండించారు. బీపీ లెవల్స్ పడిపోవడంతో 86 ఏళ్ల రతన్ టాటా.. సోమవారం ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి వెళ్లారు. దీంతో ఆయన ఆరోగ్యంపై కథనాలు వచ్చాయి. ఆయనను ఐసీయూలో చేర్చినట్లు పలు ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొన్నారు. దీంతో రతన్ టాటా తన ‘ఎక్స్’ ఖాతాలో ప్రకటన విడుదల చేశారు. ‘నా గురించి ఆలోచిస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు. నా ఆరోగ్యం గురించి జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. వయసు రీత్యా ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల నేపథ్యంలో మెడికల్ చెకప్ చేయించుకుంటున్నా. ఇందులో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను క్షేమంగానే ఉన్నా. అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేయొద్దని ప్రజలు, మీడియాను కోరుతున్నా’ అని ఆయన వెల్లడించారు.