RBI: బ్యాంకు నామినీ వివరాల్లో ఇ-మెయిల్, ఫోన్ నంబర్
బ్యాంకు డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడేందుకు ఆర్‌బీఐ కీలక నిర్ణయం;
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. బ్యాంకు డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడేందుకు నామినీ ఫారాల్లో నామినీల పేర్లతో పాటు ఇ-మెయిల్, వారి ఫోన్ నంబర్ వంటి వివరాలనూ జోడించాలని భావిస్తోంది. దీనిపై బ్యాంకులు, ప్రభుత్వం నుంచి అభిప్రాయాలను కోరుతోంది. బ్యాంకు ఖాతాదారులు ఒక్కో ఖాతాకు నలుగురిని నామినీలుగా నియమించుకునే అవకాశం కల్పించే బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు 2024కు ఇటీవల పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం నగదు డిపాజిట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల సమయంలో నామినేషన్ వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. ఇలా నామినీ వివరాల సేకరణ సమయంలో వారి ఫోన్ నంబర్, ఇ-మెయిల్ వివరాలు కూడా సేకరించాలని ఆర్‌బీఐ భావిస్తోంది. ఇందుకోసం బ్యాంకింగ్ కంపెనీస్ (నామినేషన్) రూల్స్, 1985ను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.
ఆర్థిక రంగంలో ముఖ్యంగా బ్యాంకుల్లో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను తగ్గించే ఉద్దేశంతో ఆర్‌బీఐ ఆ దిశగా వివరాలు సేకరించాలని భావిస్తోందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ వ్యక్తి ‘ఎకనమిక్ టైమ్స్’కు వెల్లడించారు. నామినీ చిరునామా, అకౌంట్ హోల్డర్ వివరాలు మారినా నామినీల వివరాలు సేకరించడం ద్వారా సమాచారం చేరవేయడం సాధ్యమవుతుందని తెలిపారు. తాము తెరిచిన పొదుపు, కరెంట్ ఖాతాలను ఏవో వ్యక్తిగత కారణాల వల్ల కొనసాగించలేకపోవడం, ఆ ఖాతాలను మూసివేయకపోవడం, కాలవ్యవధి దాటినా డిపాజిట్లను ఉపసంహరించకపోవడం, ఖాతాదారులు మరణిస్తే, చట్టబద్ధ వారసులు లేదా నామినీలు ఈ డిపాజిట్లను తీసుకోవడానికి ముందుకురాకపోవడం వల్ల ఇలాంటి ‘క్లెయిమ్ చేయని డిపాజిట్ల’ సమస్య తలెత్తుతోంది. సాధారణంగా పదేళ్లపాటు ఉండే ఈ నగదును బ్యాంకులు ఆర్‌బీఐకి బదిలీ చేయాల్సి ఉంటుంది. దీన్ని తగ్గించే దిశగా ఆర్‌బీఐ అడుగులు వేస్తోంది.